
DNews: Jan 12: ఖమ్మం నగరంలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఎన్టీఆర్ అనే మహానేత కులమతాలకు అతీతంగా, నైతికతతో, నిజాయితీతో ప్రజల అభివృద్ధి మరియు సంక్షేమం కోసం పనిచేసిన వ్యక్తి అని పేర్కొన్నారు. ఆయన ఆదివారం ఖమ్మం నగరంలోని బ్యాంక్ కాలనీలో కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన పార్కును ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ, సమాజానికి నైతికత, నిజాయితీ, కట్టుబాటు, పట్టుదల వంటి విలువలను నేర్పిన ఎన్టీఆర్ పేరుతో పార్కును ప్రారంభించడం ఒక ఆదర్శకరమైన విషయం అని అన్నారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎన్టీఆర్ అన్ని మతాలను, కులాలను, రాజకీయ పార్టీలను గౌరవించిన నాయకుడని గుర్తుచేశారు. ఆయన తెలుగు జాతి గౌరవాన్ని అన్ని దిశల్లో వ్యాప్తి చేసిన మహానేత అని అభివర్ణించారు.
ఖమ్మం నగరం తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని మంత్రి తెలిపారు. భగ్యనగరం లాగా ఖమ్మం నగరం కూడా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా ఆహ్వానించి, వారి అభివృద్ధికి తోడ్పడుతుందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు నివసించడానికి అనువైన నగరంగా ఖమ్మం నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
అంతేకాకుండా, జాతీయ రహదారులు అన్నీ ఖమ్మం మీదుగా వెళ్తున్నాయని, వాటి నిర్మాణం పూర్తయిన తర్వాత ఖమ్మం తెలంగాణలో ఒక ప్రధాన నివాసయోగ్యమైన నగరంగా అవతరిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విశ్వాసం వ్యక్తం చేశారు.
