
D Spiritual: Dec 10: భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో తులసి మొక్కకు అత్యంత పవిత్ర స్థానం ఉంది. ఇది కేవలం ఓ సాధారణ మొక్క కాదు, లక్ష్మీదేవి స్వరూపంగా పూజించబడుతుంది. తులసి పత్రాలను కోయడం, వినియోగించడం విషయంలో ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయి. శాస్త్రాలు, పండితులు సూచించినట్లుగా ఈ నియమాలను పాటించడం తప్పనిసరిగా భావిస్తారు.
తులసిని కోయరాని కొన్ని దినాలు, పరిస్థితులు ఉన్నాయి. శుక్రవారం, ఆదివారం, ఏకాదశి, అమావాస్య, పౌర్ణమి వంటి ముఖ్య పర్వదినాలలో తులసి మరియు ఉసిరి ఆకులను కోయడం నిషిద్ధం. అదేవిధంగా, స్త్రీలు తులసి పత్రాలను కోయకూడదని శాస్త్రాలు చెప్తాయి. తులసి మొక్కను నాటడం, తొలగించడం వంటి పనులను కూడా మగవారే చేయాలని సూచిస్తున్నారు.
తులసిని కోసే విధానంలో కూడా ఆచారాలు ఉంటాయి. తులసిని కోయడానికి ముందు మొక్కకు నమస్కరించి, ఆవిధంగా అనుమతి తీసుకున్నట్టు భావించి కోయడం శ్రేయస్కరం. దేవతలకు పూజ చేసే సందర్భంలో మగవారు కోసిన తులసి పత్రాలను మాత్రమే ఉపయోగించాలి అని పండితులు చెబుతున్నారు.
తులసి సాధారణంగా విష్ణుమూర్తి పూజలో అత్యంత పవిత్రంగా ఉపయోగించబడుతుంది. అయితే గణపతి మరియు శివుడి పూజల్లో తులసి పత్రాలను ఉపయోగించడం నిషిద్ధం. ఈ ఇద్దరు దేవతలకు తులసిని సమర్పించరాదు అని శాస్త్రాలు స్పష్టంగా పేర్కొన్నాయి.
