
D Spiritual: Oct 21: నగరంలో దుర్గామాత విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు పోలీసులు వాహనాల మళ్లింపు చర్యలు చేపట్టారు. ఇక్బాల్ మినార్ నుంచి సెక్రటేరియట్ జంక్షన్ వైపు వెళ్లే వాహనాలు తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ మీదుగా లోయర్ ట్యాంక్ బండ్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. ఖైరతాబాద్ బడా గణేష్ లేన్, మింట్ కాంపౌండ్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వాహనాల రాకపోకలకు అనుమతి ఉండదు. ప్రింటింగ్ ప్రెస్ జంక్షన్ వద్ద వాహనాలను మింట్ కాంపౌండ్, రాజీవ్ గాంధీ విగ్రహం వైపు మళ్లిస్తారు. అప్పర్ ట్యాంక్ బండ్ నుంచి సెక్రటేరియట్ జంక్షన్ వైపు వచ్చే వాహనాలు పాత అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి లిబర్టీ వైపు వెళ్లాలి. ప్రధాన రహదారులపై రద్దీని నివారించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
దుర్గామాత నిమజ్జనం.. ప్రయాణికులకు ట్రాఫిక్ పోలీసుల సూచనలు
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపునకు సంబంధించిన తాజా సమాచారాన్ని తెలుసుకునేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల అధికారిక సోషల్ మీడియా ఖాతాలను అనుసరించాలని అధికారులు సూచించారు. ఫేస్‌బుక్ (facebook.com/HYDTP), ఎక్స్ ఖాతా (@HYDTP) ద్వారా ట్రాఫిక్ పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం అందుబాటులో ఉంటుందని తెలిపారు.
ప్రయాణికులకు అత్యవసర సమయాల్లో సహాయం అందించేందుకు ప్రత్యేక ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 9010203626 ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. నగరవాసులు నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా పోలీసులకు సహకరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. నిమజ్జన కార్యక్రమాలు పూర్తయ్యే వరకు సంబంధిత ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.
