
D Spiritual: Jan 6: సంకటహర చతుర్థి రోజున గణేశుణ్ని భక్తిశ్రద్ధలతో పూజిస్తే జీవితంలోని సంకటాలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ తిథి మంగళవారానికి వస్తే, మంగళవారానికి అధిపతి అయిన కుమార స్వామి అనుగ్రహం కూడా లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ శుభదినాన శివపుత్రులైన గణేశుడు, కుమారస్వామిని కలిపి పూజించి వ్రతం ఆచరిస్తే ఆర్థిక, వివాహ, సంతాన సమస్యలు తొలగిపోతాయని, పిల్లలకు ఏకాగ్రత, జ్ఞానం పెరుగుతాయని సూచిస్తున్నారు.
ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. అనంతరం గణేశ ఆలయానికి వెళ్లి పూజ చేయడం ఉత్తమం. ఆలయానికి వెళ్లలేని వారు ఇంట్లోనే గణపతిని ఆరాధించవచ్చు. నేతి దీపాలు వెలిగించి, గరిక, పూలు, మోదకాలు, లడ్డూలను నైవేద్యంగా సమర్పించాలి. వినాయక స్తోత్రాలు పఠిస్తూ రోజంతా ఉపవాసం ఉండి, మానసిక స్వచ్ఛతను పాటించాలి.
సాయంత్రం చంద్రోదయం తర్వాత చంద్రుడిని దర్శించి పూజ పూర్తి చేయాలి. చంద్ర దర్శనం అనంతరం మాత్రమే ఉపవాసాన్ని విరమించాలి. భక్తితో ఆచరించే ఈ వ్రతంతో కష్టాలు, అడ్డంకులు తొలగిపోయి జీవితంలో సానుకూల మార్పులు కలుగుతాయని నమ్మకం ఉంది.
సంకటహర చతుర్థి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించవచ్చని శాస్త్రాలు సూచిస్తున్నాయి. వ్రత పూజలో భాగంగా ఎరుపు లేదా తెల్లని వస్త్రంలో మూడు గుప్పిళ్ల బియ్యం, ఎండు ఖర్జూరాలు, వక్కలు, దక్షిణ ఉంచి కోరుకున్న కోరికను మనసులో తలచుకుంటూ ముడుపు కట్టాలి.
స్తోత్రాలు, వ్రత కథ పఠించి గణేశునికి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. సూర్యాస్తమయం వరకు వినాయకుడిని కదపకూడదని ఆచారం. సాయంత్రం తిరిగి పూజ నిర్వహించి, ముడుపు బియ్యంతో పొంగలి వండి స్వామికి నివేదించి ప్రసాదంగా స్వీకరించాలి. ఈ విధంగా శాస్త్రోక్తంగా వ్రతం ఆచరిస్తే గణేశుని కృప సంపూర్ణంగా లభిస్తుందని విశ్వసిస్తారు.
