
గణేశ్ నవరాత్రుల సందర్భంగా విశేష పూజలు అందుకున్న ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి సిద్ధమయ్యాడు. మహాగణపతిని టస్కర్‌పైకి చేర్చడంతో కాసేపట్లో శోభాయాత్ర ప్రారంభం కానుంది. గణనాథుడు వెళ్లే మార్గాలను పోలీసులు బ్లాక్ చేసి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
ఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద నిమజ్జనోత్సవం శోభాయాత్రకు చేసిన బందోబస్తు ఏర్పాట్లను సీపీ వీసీ సజ్జనార్ పరిశీలించారు. ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను సమీక్షించిన ఆయన అంతకుముందు అధికారులతో కలిసి మహాగణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు సాగే ప్రధాన శోభాయాత్ర ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని సీపీ తెలిపారు. జీహెచ్ఎంసీ, విద్యుత్ జలమండలి తదితర శాఖల సమన్వయంతో ముందస్తు ప్రణాళికను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.
నిమజ్జనోత్సవాల భద్రత కోసం దాదాపు 20 వేల మంది పోలీసు సిబ్బందిని విధుల్లోకి తీసుకున్నామని సజ్జనార్ తెలిపారు. శోభాయాత్ర మార్గాల్లో ఏర్పాటు చేసిన 10 వేల సీసీ కెమెరాలను టీజీఐసీసీసీ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించినట్లు చెప్పారు.
మహిళలు యువతుల భద్రత కోసం మూడు షిఫ్టుల్లో 26 షీ-టీమ్స్ బృందాలు విధులు నిర్వహించనున్నాయని సీపీ పేర్కొన్నారు. ట్రాఫిక్ విభాగం జారీ చేసే మార్గదర్శకాలను ప్రజలు పాటిస్తూ తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచించారు. నిమజ్జనోత్సవాలను శాంతియుతంగా ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకోవాలని సీపీ సజ్జనార్ ప్రజలకు పిలుపునిచ్చారు.
