
D Spiritual: Oct 12: హిందూ సంప్రదాయంలో పూజా కార్యక్రమాలకు, ఇష్ట దైవారాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా, సోమవారం రోజున భక్తులందరూ మహా శివుడిని పూజిస్తూ ఉంటారు, ఈ రోజు శివాలయాలకు వెళ్లి దర్శనం చేసుకుంటారు. అయితే, శివాలయానికి వెళ్లినప్పుడు భక్తులందరూ తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.
శివాలయానికి వెళ్లిన భక్తులు మొదటగా ఆలయ గోపురం దర్శించగానే, మనసులో పంచాక్షరి మంత్రాన్ని (ఓం నమః శివాయ) జపిస్తూ, రెండు చేతులు జోడించి, మనసును శివారాధనకై లీనం చేయాలి. మహిళలు ఆలయానికి వెళ్లినప్పుడు జుట్టు విరబోసుకోకుండా తప్పనిసరిగా ముడి వేసుకొని వెళ్లాలి. ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత, మొదట వినాయకుడిని దర్శించి, వినాయక స్తుతి చెప్పి, గణపతి ముందు గుంజీలు తీయాలి.
ఆలయం చుట్టూ కేవలం మూడు ప్రదక్షిణలు మాత్రమే చేయాలి. ఇక గర్భగుడిలోకి అడుగుపెట్టే ముందు, మొదట నందీశ్వరుడికి నమస్కారం చేయాలి. ఆ తరువాత, నందీశ్వరుడి కొమ్ముల నుండి శివుని దర్శనం చేసుకోవాలి. శివుని దర్శించుకుని గర్భగుడి నుండి బయటికి వచ్చిన తర్వాత, ఎట్టి పరిస్థితులలోను ధ్వజస్తంభానికి నమస్కరించకూడదు. ఇలా శివుని దర్శించుకున్న తర్వాత ధ్వజస్తంభాన్ని నమస్కరించడం వల్ల శివుడిని దర్శించుకున్న పుణ్యఫలం లభించదు అని పండితులు సూచిస్తున్నారు.
