
D Spiritual: Feb 2: అన్నం పరబ్రహ్మ స్వరూపమని పెద్దలు చెబుతారు. దీనికి సంబంధించిన ఒక ప్రసిద్ధ మహాభారత కథ ఉంది. అంపశయ్యపై ఉన్న భీష్ముడు తన చుట్టూ చేరిన పాండవులకు ధర్మ సూక్ష్మాలను వివరిస్తూ ఉపదేశం చేస్తున్నాడు. అక్కడే ఉండి ఆ మాటలు వింటున్న ద్రౌపది ఒక్కసారిగా నవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె నవ్వు భీష్ముడి మాటల ప్రవాహానికి భంగం కలిగించడంతో, “అమ్మా! నువ్వెందుకు నవ్వావో నాతో పాటు వీళ్లకూ తెలియాలి. కాస్త చెప్పమ్మా” అని భీష్ముడు అడిగాడు.
దానికి ద్రౌపది సమాధానంగా, “భీష్మాచార్యా! ఇంకొద్ది రోజుల్లో మరణించబోయే మీరు ఇంత చక్కగా ధర్మం గురించి చెబుతున్నారు. అది బాగానే ఉంది. కానీ నాడు నా వస్త్రాపహరణ సమయంలో ఈ ధర్మ పరిజ్ఞానం అంతా ఏమైపోయిందో అనిపించగానే నవ్వు ఆగలేదు” అని చెప్పిందట.
అప్పుడు భీష్ముడు, “నువ్విలా నవ్వడం మంచిదయ్యిందమ్మా. నువ్వు నవ్వకపోయుంటే ఇది నాకూ నీకూ, ఇక్కడున్న వారందరికీ కూడా శేష ప్రశ్నగానే మిగిలిపోయేది. నీ సందేహానికి నా సమాధానం విను” అంటూ వివరించడం ప్రారంభించాడు. “నేను సుయోధనుడు పెట్టిన మలినమైన అన్నం తిన్నాను. అది నా రక్తంలో కలిసి, నా విజ్ఞతను, వివేకాన్ని తెరలా కప్పేసింది. అందువల్ల అప్పట్లో నా కర్తవ్యం గుర్తుకు రాలేదు. నేడు అర్జునుడి బాణాల వల్ల నా రక్తంలోని ఆ కాలుష్యమంతా తొలగిపోయింది. అందుకే ఇప్పుడు ధర్మం మాట్లాడగలుగుతున్నాను” అని చెప్పాడు.
అన్నం మహిమ అంతటిదని ఈ కథ ద్వారా తెలుస్తుంది. అందుకే అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు. మనం తినే ఆహారం కష్టార్జితంతో సంపాదించబడినదై ఉండాలి. పీడన సొమ్ముతో లభించిన ఆహారం చెడు ఆలోచనలు కలిగిస్తుందని శాస్త్రాలు చెబుతాయి.
కాబట్టి ఆహారం స్వార్జితం, దైవార్పితం, మితం అయి ఉంటే మనసు పరిశుద్ధంగా ఉంటుంది, ధర్మమార్గంలో నడిపిస్తుంది. సాత్విక ఆహారంతో ఆత్మ, దేహం రెండూ ఆరోగ్యంగా ఉంటాయి. దైవసాధనలో మనసు నిగ్రహం కోల్పోకుండా నిలుస్తుందని పెద్దల ఉపదేశం.
