The Traitors Telugu: Teja Sajja To Host New Reality Show With 20 Celebrities

D News: ఓటీటీ ప్రపంచంలో మరో క్రేజీ రియాలిటీ షో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే అంతర్జాతీయంగా భారీ ఆదరణ సొంతం చేసుకున్న ‘ది ట్రైటర్స్’ ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. హిందీలో రెండు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ పాపులర్ మైండ్ గేమ్ షో.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ షోకు సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేయడంతో షోపై ఆసక్తి మరింత పెరిగింది.

తేజా సజ్జా హోస్ట్‌గా కొత్త అవతారం!

‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో తేజా సజ్జా ఇప్పుడు హోస్ట్‌గా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు. ‘ది ట్రైటర్స్ తెలుగు’తో ఆయన తొలిసారి డిజిటల్ హోస్ట్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తన స్పాంటేనిటీ, మాటల చాతుర్యంతో గేమ్‌ను ఆయన ఎలా నడిపిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

20 మంది సెలబ్రిటీలతో మైండ్ గేమ్!

రాజస్థాన్‌లోని జైసల్మీర్‌ సూర్యగఢ్ ప్యాలెస్‌ను వేదికగా చేసుకుని ఈ షోను గ్రాండ్‌గా రూపొందించారు. మొత్తం 20 మంది సెలబ్రిటీ కంటెస్టెంట్లు ఇందులో పాల్గొననున్నారు. అయితే ఈ గేమ్‌లో అసలు ట్విస్ట్ ఏంటంటే.. కంటెస్టెంట్లలో కొందరు ‘ట్రైటర్స్’గా, మరికొందరు ‘ఇన్నోసెంట్స్’గా ఉంటారు.

ట్రైటర్స్ తమ అసలు గుర్తింపును దాచుకుంటూ గేమ్‌లో ముందుకు సాగాల్సి ఉంటుంది. మరోవైపు ఇన్నోసెంట్స్.. తమలో దాగి ఉన్న ద్రోహులను గుర్తించి గేమ్ నుంచి బయటకు పంపించాల్సి ఉంటుంది. నమ్మకం, అనుమానం, వ్యూహాలు, సీక్రెట్ అలయన్సెస్‌తో సాగే ఈ గేమ్‌లో ప్రతి ఎపిసోడ్‌లోనూ కొత్త ట్విస్టులు ఉండనున్నాయి.

అక్టోబర్ 15 నుంచి స్ట్రీమింగ్!

ప్రముఖ నిర్మాణ సంస్థ SOL Productions రూపొందిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’ అక్టోబర్ 15 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. నాలుగు వారాల పాటు మొత్తం 10 ఎపిసోడ్లుగా ఈ షోను అందించనున్నారు. ప్రతి గురువారం కొత్త ఎపిసోడ్స్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఇక షోలో పాల్గొనే 20 మంది సెలబ్రిటీల వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు. మరి తేజా సజ్జా హోస్టింగ్‌లో ఈ సరికొత్త మైండ్ గేమ్ షో తెలుగు ఓటీటీ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

By Avinash