D Spiritual: Sept 29: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని కాశీ పీఠం సంస్థాన పీఠాధిపతులు శ్రీ శివ నాగేంద్ర సరస్వతి మహాస్వామీజీ మంగళవారం ఉదయం దర్శించుకున్నారు.

ఆలయానికి విచ్చేసిన మహాస్వామీజీకి ప్రధాన అర్చక బృందం, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఆలయ సంప్రదాయాల ప్రకారం ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని శివాలయంలో కొలువైన పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామివారిని మహాస్వామీజీ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దర్శనానంతరం ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య మహాస్వామీజీకి మంగళాశాసనాలు అందజేశారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక ఆశీర్వచనాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా దేవస్థానం ఈవో జే. భవానీశంకర్ మహాస్వామీజీకి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి తీర్థప్రసాదాలను, జ్ఞాపిక చిత్రపటాన్ని సమర్పించారు. అనంతరం మహాస్వామీజీ ఆశీర్వచనాలు తీసుకున్నారు.