D Educt: Sept 29: త్రిభాషా విధానం నుంచి ఏడో తరగతిని మినహాయించినట్లే, ఈ ఏడాది ఆరో తరగతిలో ఉన్న విద్యార్థులకు కూడా మినహాయింపు ఇవ్వవచ్చేమో పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (సీబీఎస్‌ఈ)కి సుప్రీంకోర్టు సూచించింది.

ప్రస్తుత విద్యా సంవత్సరంలో 7, 8, 9 తరగతులు చదువుతున్న విద్యార్థులు పదో తరగతికి వచ్చినప్పుడు తృతీయ భాష పరీక్ష రాయాల్సిన అవసరం లేదని సీబీఎస్‌ఈ ఇప్పటికే ప్రకటించింది. ఇదే సడలింపును ప్రస్తుతం ఆరో తరగతిలో ఉన్న విద్యార్థులకు కూడా వర్తింపజేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌మల్యా బాగ్చీ, జస్టిస్‌ వి.మోహన్‌లతో కూడిన ధర్మాసనం సెప్టెంబరు 28న సూచించింది.

త్రిభాషా విధానాన్ని ఇప్పటికే 99 శాతం పాఠశాలలు స్వీకరించాయని, ఈ విద్యాసంవత్సరం నుంచే దాన్ని అమలు చేయాల్సి ఉందని కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం మినహాయింపు ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా లేదని ఆయన స్పష్టం చేశారు.

అయితే, త్రిభాషా విధానం అమలును మరో ఏడాది వరకు వాయిదా వేస్తే పాఠశాలలు కూడా అందుకు అనుగుణంగా అవసరమైన ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ అంశంపై సీబీఎస్‌ఈ నాలుగు వారాల్లో ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.

నేతాజీ చితాభస్మంపై కేంద్రానికి ఆదేశాలు

నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ చితాభస్మాన్ని టోక్యోలోని రెంకోజీ ఆలయం నుంచి భారత్‌కు తీసుకురావాలని ఆయన కుమార్తె అనిత దాఖలు చేసిన పిటిషన్‌పైనా సుప్రీంకోర్టు స్పందించింది. ఈ పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం నాలుగు వారాల్లో తమ స్పందనను తెలియజేయాలని ఇదే ధర్మాసనం ఆదేశించింది.