
D Educt: Sept 26: ఇంటర్న్‌షిప్‌లపై తెలుగు రాష్ట్రాల యువత ఆసక్తి
చదువు పూర్తయ్యేలోపే ఉద్యోగ అనుభవాన్ని పొందేందుకు తెలుగు రాష్ట్రాల యువత ఇంటర్న్‌షిప్‌లపై ఆసక్తి చూపుతోంది. ఆసక్తి చూపడమే కాకుండా పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌లను సైతం దక్కించుకుంటున్నారు. ఈ విషయంలో తెలంగాణ విద్యార్థులు దేశంలో మొదటి స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచింది. కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఇంటర్న్‌షిప్ పోర్టల్ 2025-26 నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
దేశవ్యాప్తంగా 81 వేల కంపెనీలు, పరిశ్రమల్లో సుమారు 22 లక్షల మంది విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌లు పూర్తి చేశారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే సుమారు 6.10 లక్షల మంది ఉండటం గమనార్హం. విద్యార్థులు చదువుతోపాటు ప్రాక్టికల్ అనుభవాన్ని పొందేందుకు ఇంటర్న్‌షిప్‌లను కీలక అవకాశంగా భావిస్తున్నారు.
ఉద్యోగానికి తొలిమెట్టుగా ఇంటర్న్‌షిప్
గత కొంతకాలంగా కంపెనీలు, ముఖ్యంగా ఐటీ సంస్థలు ప్రముఖ కళాశాలలకు వెళ్లి విద్యార్థులను పెయిడ్ ఇంటర్న్‌షిప్‌లకు ఎంపిక చేసుకుంటున్నాయి. కొన్ని సంస్థలు మూడో సంవత్సరం పూర్తయిన తర్వాత రెండు నెలలపాటు సమ్మర్ ఇంటర్న్‌షిప్‌లను అందిస్తున్నాయి. కళాశాలల్లోనే విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్న కంపెనీలు నెలకు రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు స్టైపెండ్ చెల్లిస్తున్నాయి.
ఇంటర్న్‌షిప్ సమయంలో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కొన్ని సంస్థలు ముందుగానే ఉద్యోగ అవకాశాలను కూడా కల్పిస్తున్నాయి. దీంతో బృందంతో కలిసి పనిచేయడం, పని ఒత్తిడిని ఎదుర్కోవడం, ఉన్నతాధికారులతో సమర్థంగా మాట్లాడటం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన ఏర్పడుతోంది. ఉద్యోగంలో చేరిన తర్వాత అదనపు శిక్షణ అవసరం లేకుండా విధులు నిర్వహించేందుకు ఇంటర్న్‌షిప్‌లు ఉపయోగపడతాయని ఏపీ, తెలంగాణ విద్యార్థులు భావిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ వంటి వృత్తి విద్యా కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య అధికంగా ఉంది. దీంతో భారీ వార్షిక వేతన ప్యాకేజీతో ఉద్యోగం సాధించాలంటే సాంకేతిక నైపుణ్యాల్లో ముందుండాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో డిమాండ్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి విభాగాలను నేర్చుకునేందుకు విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌లపై ఆసక్తి చూపుతున్నారని పేర్కొంటున్నారు.
ప్రముఖ కళాశాలల్లో 60 నుంచి 70 శాతం మంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు లభిస్తున్నప్పటికీ, మిగతా కళాశాలలకు కంపెనీలు రాకపోవడం, యాజమాన్యాలు కూడా తగినంత చొరవ చూపకపోవడంతో విద్యార్థులు నేషనల్ ఇంటర్న్‌షిప్ పోర్టల్‌పై ఆధారపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి 8.49 లక్షల మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 6.15 లక్షల మంది ఉద్యోగ అనుభవం కోసం పోర్టల్‌లో నమోదు చేసుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు.
