తెలంగాణలో 2004 తర్వాత నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) వర్తింపజేసే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004కు ముందు ఉద్యోగాల నోటిఫికేషన్లు వెలువడి, ఆ తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులకు ఓపీఎస్ వర్తింపజేయాలని గతంలో కోర్టులు తీర్పులు ఇచ్చాయి.

అదే తరహాలో తమకు కూడా పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని కోరుతూ కొందరు ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు. వారి వినతులను పరిశీలించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఆ ఆదేశాల అమలులో ప్రభుత్వం జాప్యం చేయడంతో ఉద్యోగులు కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేశారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ శుక్రవారం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ఎల్. నరసింహారెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం 41 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 17కు వాయిదా వేసింది.

By Rajini