తెలంగాణ అసెంబ్లీ వద్ద మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి చీరను పోలీసులు లాగారన్న ఘటనపై తీవ్ర దుమారం కొనసాగుతోంది. ఈ ఘటనను బీఆర్‌ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. తాజాగా స్పందించిన సునీతా లక్ష్మారెడ్డి అసెంబ్లీ చరిత్రలో ఇది బ్లాక్ డేగా నిలిచిపోతుందని అన్నారు. ఈ ఘటనను ‘దుశ్శాసన పర్వం’గా భావిస్తున్నామని పేర్కొన్నారు.

అసెంబ్లీ సాక్షిగా మహిళా సభ్యులకు అవమానం జరిగిందని ఆమె మండిపడ్డారు. మహిళా నేతల గొంతు పట్టడం, జుట్టు లాగడం ఏంటని ప్రశ్నించారు. మహిళలను అవమానించడమే ఇందిరమ్మ రాజ్యమా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. దేశ చరిత్రలోనే ఇలాంటి ఘటన జరిగి ఉండదని సునీతా లక్ష్మారెడ్డి వ్యాఖ్యానించారు.

మరోవైపు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అసెంబ్లీకి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. ప్రభుత్వం విఫలమైందని మాత్రమే తాము ఆరోపించామని తమను అవమానించాలన్న ఆదేశాలు ఎవరు ఇచ్చారో తేలాల్సి ఉందన్నారు.

సమయానికి కేటీఆర్ అక్కడికి రాకపోయి ఉంటే మహిళా నేతలను కిందపడేసి తొక్కేవారని సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. అసెంబ్లీకి వచ్చే మహిళా సభ్యులకే రక్షణ లేకపోవడం దారుణమని విమర్శించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

By Rajini