
జైనూర్, నవంబర్ 4: దీపావళి పండుగ నేపథ్యంలో బాణసంచా విక్రయించే వ్యాపారులు తప్పనిసరిగా సంబంధిత అధికారుల నుంచి లైసెన్స్ పొందాలని జైనూర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గోదారి రవికుమార్ సూచించారు. ఎలాంటి అనుమతులు లేకుండా పటాకులు విక్రయించినా, నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బాణసంచా నిల్వలు, విక్రయాల విషయంలో ప్రభుత్వం నిర్దేశించిన ఎక్స్‌ప్లోజివ్స్ యాక్ట్, ఎక్స్‌ప్లోజివ్స్ రూల్స్–2008 నిబంధనలను ప్రతి వ్యాపారి తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిషేధించిన క్రాకర్స్, అనుమతులు లేని బాణసంచా, నాణ్యతా ప్రమాణాలు పాటించని వస్తువులను విక్రయించకూడదని తెలిపారు.
పటాకుల దుకాణాల వద్ద అగ్నిమాపక పరికరాలను తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. దుకాణాల పరిసరాల్లో ధూమపానం, బహిరంగ మంటలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదన్నారు. అధికారుల అనుమతి పొందిన ప్రదేశాల్లోనే దుకాణాలను ఏర్పాటు చేయాలని, నిర్ణీత పరిమితికి మించి బాణసంచా నిల్వ చేయరాదని స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేస్తే చర్యలు
మరోవైపు సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు, వదంతులు వ్యాప్తి చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని గోదారి రవికుమార్ హెచ్చరించారు. కుల, మత, వర్గాల మధ్య విభేదాలు సృష్టించేలా రెచ్చగొట్టే పోస్టులు, సందేశాలు, వీడియోలను ప్రచారం చేయడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు.
ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని నమ్మవద్దని, ధ్రువీకరించని వార్తలను ఇతరులకు ఫార్వర్డ్ చేయకూడదని సూచించారు. అనుమానాస్పద సమాచారం లేదా వదంతులు కనిపిస్తే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు.
అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవం, సోదరభావంతో పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే వారిని ఉపేక్షించబోమని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌హెచ్‌వో గోదారి రవికుమార్ స్పష్టం చేశారు.
