
D News: Oct 31: వెండి ధరలకు భారీ షాక్.. ఒక్క నెలలోనే రూ.45 వేలు పతనం
న్యూఢిల్లీ: దేశీయ బులియన్ మార్కెట్లో వెండి ధరల పతనం కొనసాగుతోంది. ఇటీవల భారీగా పెరిగిన వెండి ధరలు ప్రస్తుతం వరుసగా తగ్గుముఖం పడుతుండటంతో కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల్లో ఆసక్తి నెలకొంది. శుక్రవారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర ఏకంగా రూ.8,300 తగ్గి రూ.1,90,200కు చేరింది. ఈ నెలలో ఇప్పటివరకు వెండి ధర మొత్తం రూ.45 వేల మేర పడిపోవడం గమనార్హం. తాజా తగ్గుదలతో వెండి ధరలు గత 11 నెలల కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. గతేడాది డిసెంబర్ 10న కిలో వెండి ధర రూ.1.92 లక్షలుగా నమోదైంది. ప్రస్తుతం అంతకంటే తక్కువ స్థాయికి ధరలు పడిపోవడంతో మార్కెట్ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.
అంతర్జాతీయ పరిణామాలతో వెండి ధరలకు బ్రేక్
వెండి ధరల పతనానికి అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలే ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా క్రూడాయిల్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంపై నెలకొన్న ఆందోళనలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై వెలువడుతున్న అంచనాలు విలువైన లోహాల ధరలపై ప్రభావం చూపుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ, బాండ్ ఈల్డ్స్‌లో చోటుచేసుకుంటున్న మార్పులు కూడా బంగారం, వెండి ధరల కదలికలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పెట్టుబడిదారులు తమ పెట్టుబడి వ్యూహాలను మార్చుకుంటుండటంతో వెండి ధరలపై ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
మళ్లీ పెరుగుతాయా.. మరింత తగ్గుతాయా?
ప్రస్తుతం వెండి ధరలు భారీగా తగ్గడంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో ధరలు మరింత తగ్గుతాయా? లేదా మళ్లీ పుంజుకుంటాయా? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే వెండి కొనుగోలు చేయాలనుకునే వారు లేదా పెట్టుబడులు పెట్టాలనుకునే వారు మార్కెట్ పరిస్థితులు, ధరల హెచ్చుతగ్గులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిది.
