DET:DEC 01:
IFFI 2025లో దల్దల్ ఫస్ట్ లుక్ ఆవిష్కరణ!
భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలో రాబోతున్న దల్దల్ అనే సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను గోవాలో జరిగిన 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా IFFI 2025 వేదికగా ఆవిష్కరించారు. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్, ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. ఈ సందర్భంగా ప్రత్యేక టీజర్ ప్రివ్యూను కూడా ప్రదర్శించారు.

విష్ ధమిజా భేండి బజార్ నవల ఆధారంగా…
ఈ సిరీస్ ప్రముఖ రచయిత విష్ ధమిజా రాసిన బెస్ట్ సెల్లింగ్ నవల ‘భేండి బజార్’ ఆధారంగా రూపొందించబడింది. ఇందులో భూమి పెడ్నేకర్ ముంబై నగరంలో కొత్తగా నియమితులైన DCP రీటా ఫెరీరా పాత్రను పోషిస్తున్నారు. ఒక కిరాతక హంతకుడిని పట్టుకునే క్రమంలో ఆమెకు ఎదురైన నైతిక సవాళ్లు, అలాగే తన గతాన్ని వెంటాడే జ్ఞాపకాలతో ఆమె చేసే పోరాటం ఈ కథాంశంగా ఉంటుంది. ఈ సిరీస్‌ను సురేష్ త్రివేణి క్రియేట్ చేయగా, అమృత్ రాజ్ గుప్తా దర్శకత్వం వహించారు.

భూమి పెడ్నేకర్ సవాలుతో కూడిన పాత్ర:
దల్దల్ లో తాను పోషించిన DCP రీటా ఫెరీరా పాత్ర గురించి భూమి పెడ్నేకర్ ఇఫీ 2025లో మాట్లాడారు. ఈ పాత్ర తన కెరీర్‌లోనే చాలా సవాలుతో కూడినది అని తెలిపారు. శక్తి అనేది బిగ్గరగా అరిచేదిగా ఉండనవసరం లేదు. అది నిశ్శబ్దంగా, దృఢంగా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నిరంతరం ప్రశ్నించేదిగా ఉండవచ్చు. అదే నేను మా అమ్మలో చూశాను, అదే రీటా పాత్రలో కూడా ఉంది. ఆమె ఎక్కువగా మాట్లాడదు, కానీ చాలా పనులు చేస్తుంది అని భూమి అన్నారు. డైలాగులు లేదా ఎక్స్‌ప్రెసివ్ కళ్ళపై ఆధారపడకుండా చిన్న శారీరక కదలికల ద్వారా భావోద్వేగాలను పలికించాల్సి వచ్చిందని, అది తనను బాగా కష్టపెట్టిందని చెప్పారు.

కథలో ఏం ఆశించవచ్చు?
ఇది కేవలం హంతకుడు ఎవరు? అనే సాధారణ Who Dunnit తరహా క్రైమ్ కథ కాదు. మంచీ-చెడుల మధ్య ఉండే గ్రే జోన్‌లను మరియు మనిషి అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? అనే లోతైన ప్రశ్నకు సమాధానం వెతకడానికి ప్రయత్నిస్తుంది. సిరీస్ సృష్టికర్తలు చెప్పిన దాని ప్రకారం, ఇందులో పాత్రలను కేవలం మంచోళ్లుగానో లేదా చెడ్డోళ్లుగానో చూపకుండా మానవ సహజమైన లోపాలు, బలహీనతలు అనేక లేయర్లు ఉన్న వ్యక్తులుగా చిత్రీకరించారు. ప్రేక్షకులే వారి పాయింట్ ఆఫ్ వ్యూను నిర్ణయించుకోవడానికి అవకాశం ఇస్తారు.

విడుదల ఎప్పుడు?
ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ప్రైమ్ వీడియోలో త్వరలో స్ట్రీమింగ్ కానుంది. విడుదల తేదీ మరియు ఇతర వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. భూమి పెడ్నేకర్‌తో పాటు ఇందులో ఆదిత్య రావల్, సమరా తిజోరి కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.