
DET:DEC 01:
బ్లాక్‌బస్టర్ హిట్‌గా ఎకో సినిమా!
కొత్త నటీనటులు సాంకేతిక నిపుణులతో రూపొందిన ఎకో చిత్రం బాక్సాఫీస్ వద్ద 25 కోట్ల రూపాయలకు పైగా ప్రపంచవ్యాప్త వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది.కేవలం ₹5 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సైకలాజికల్ యాక్షన్ డ్రామా,విడుదలైన కొద్ది రోజుల్లోనే పెట్టిన పెట్టుబడిని వెనక్కి తీసుకురావడమే కాక భారీ లాభాలను ఆర్జించి, మలయాళ చిత్ర పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది. స్టార్ హీరోల సినిమాలు సైతం నిలబడలేని చోట, ఒక చిన్న సినిమా ఇంత పెద్ద విజయాన్ని అందుకోవడం విశేషం.
దింజిత్ అయ్యాతన్ విజయం, సందీప్ ప్రదీప్ నటన:
దర్శకుడు దింజిత్ అయ్యాతన్ తన మునుపటి సినిమా కిష్కింద కాండంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఎకో తో మరోసారి తన ప్రతిభను చాటుకున్నారు. ఈ సినిమాకు కథా రచయిత, సినిమాటోగ్రాఫర్ అయిన బాహుల్ రమేష్ ఆలోచనా విధానం, దానిని దింజిత్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యపాత్ర పోషించిన యువ నటుడు సందీప్ ప్రదీప్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. కథలోని మిస్టరీని పీయుస్ అనే క్యారెక్టర్లో సందీప్ అద్భుతంగా పండించాడని అందరూ మెచ్చుకుంటున్నారు.
యానిమల్ ట్రైయాలజీ’లో మూడవ సినిమా:
ఎకో చిత్రం యానిమల్ ట్రైయాలజీ కాన్సెప్ట్‌లో రూపొందించిన మూడవ మరియు చివరి భాగం. దీనిలో జంతువులు మనుషుల మధ్య ఉండే బంధాన్ని భద్రత, నియంత్రణ వంటి అంశాల మధ్య ఉన్న సన్నని గీతను ఆసక్తికరంగా చూపించారు. ఈ సినిమాలో కుక్కల పాత్ర ముఖ్యమైనది. నటులు వినీత్, నారాయణ్ కుమార్, బినూ పప్పు, అశోకన్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో నటించగా, బాలీవుడ్ నటుడు సౌరభ్ సచ్‌దేవా పోషించిన కురియచ్చన్ పాత్ర కూడా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.
బ్లాక్‌బస్టర్‌గా మారిన వైనం:
పెద్ద అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమాకు, తొలిరోజు వసూళ్లు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ, మౌత్ టాక్ అద్భుతంగా ఉండటంతో వసూళ్లు రోజురోజుకు పెరిగాయి. ముఖ్యంగా రెండవ వారం కూడా కలెక్షన్స్ తగ్గకపోవడం ఈ సినిమాకు ఎంత మంచి స్పందన వచ్చిందో తెలియజేస్తుంది. మంచి కథ, కథనం, నటీనటుల ప్రతిభ ఉంటే, పెద్ద స్టార్స్ అవసరం లేకుండా కూడా సినిమాను విజయవంతం చేయవచ్చని ఎకో మరోసారి నిరూపించింది.
