
D News: ‘మహాభారతం’ సీరియల్‌లో భీముడి పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్‌పై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను శారీరకంగా, మానసికంగా వేధించాడని ఓ యువతి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. 2021లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సౌరవ్ గుజ్జార్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వాట్సాప్‌లో ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం కొనసాగింది. 2021 డిసెంబర్ 25న తొలిసారి కలిసిన సమయంలో తనను భార్యలా చూసుకుంటానని సౌరవ్ హామీ ఇచ్చాడని ఆమె ఆరోపించింది.
అమెరికాలో ఉన్న సమయంలోనూ, భారత్‌కు వచ్చిన తర్వాత కూడా తామిద్దరం కలిసి ఉన్నామని ఆమె తెలిపింది. అంతేకాకుండా కలిసి వ్యాపారం చేద్దామని సౌరవ్ చెప్పడంతో అమెరికాలో చేస్తున్న ఉద్యోగాన్ని కూడా వదిలి వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొంది.
పెళ్లి గురించి అడిగితే బ్లాక్ చేశాడని ఆరోపణ
సౌరవ్ వేధింపుల కారణంగా ఉద్యోగంపై సరిగ్గా దృష్టి పెట్టలేకపోయానని యువతి ఆరోపించింది. పెళ్లి గురించి ప్రశ్నించిన ప్రతిసారీ తన ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేసి దూరంగా ఉండేవాడని ఫిర్యాదులో పేర్కొంది.
2025 అక్టోబర్ నుంచి 2026 మార్చి వరకు సౌరవ్ తనతో ఉన్నాడని, ఆ తర్వాత హైదరాబాద్‌లో ఇద్దరూ కలిసి ఉన్న సమయంలో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయాడని ఆమె ఆరోపించింది.
ముంబై ఎయిర్‌పోర్టులో అదుపులోకి
యువతి ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో సౌరవ్ గుజ్జార్‌ను ముంబై ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అనంతరం అతడిని హైదరాబాద్‌కు తీసుకువచ్చి కోర్టులో హాజరుపరిచే ప్రక్రియ చేపట్టినట్లు తెలుస్తోంది.
అయితే యువతి చేసిన ఆరోపణలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఈ వ్యవహారంపై సౌరవ్ గుజ్జార్ వైపు నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది.
