
DNews:06 Dec: సంక్రాంతికి ఇంకా నెలరోజుల పైనే ఉన్నా… పండుగ కోసం ఊరెక్కే వారి కష్టాలు ముందుగానే మొదలయ్యాయి. ఇప్పటికే రైళ్లలో రిజర్వేషన్ సీట్లు పూర్తిగా నిండిపోయాయి. పండుగను స్వగ్రామాల్లో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవడానికి నగరాల్లో ఉంటున్న ప్రజలు రెండు నెలల ముందుగానే టికెట్ బుకింగ్స్ పూర్తి చేసుకున్నారు. ఇప్పటికీ టికెట్ దొరకని వారు చివరి నిమిషంలో ఎవరైనా రద్దు చేస్తారేమో అన్న ఆశతో వెయిటింగ్‌లో ఉన్నారు.ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి పండగను అత్యంత వైభవంగా జరుపుకునే సంప్రదాయం ఉండటంతో నగరాల్లో పనిచేస్తున్నవారు పెద్ద ఎత్తున రైళ్లను ఆశ్రయిస్తారు. ప్రైవేట్ ట్రావెల్స్, ఆర్టీసీ బస్సులతో పోలిస్తే రైలు టికెట్ ధరలు తక్కువ ఉండటం కూడా రైళ్లకు భారీ డిమాండ్‌కు కారణమైంది. దీనివల్ల పలు రైళ్లలో పండగ రోజులకు సంబంధించిన రిజర్వేషన్ పూర్తిగా అయిపోయింది.
కరోనా సమయంలో రద్దు చేసిన కాచిగూడ–టాటానగర్ రైలును ఇప్పటికీ పునరుద్ధరించలేదు. ఈ రైలు కాచిగూడ నుంచి గుంటూరు, విజయవాడ, ఏలూరు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పలాస మీదుగా టాటానగర్‌కు వెళ్లేది. దీనికి ముందుగా భారీ డిమాండ్ ఉండేది. అలాగే పండుగ సందర్బంగా నడిపిన కాచిగూడ–కాకినాడ ప్రత్యేక రైలును కూడా నిలిపివేశారు.సంక్రాంతి సమీపిస్తున్న నేపథ్యంలో ఈ రెండు రైళ్లను మళ్లీ నడపాలని ప్రయాణికులు బలంగా డిమాండ్ చేస్తున్నారు. రైళ్ల కొరత కారణంగా ప్రయాణ ఖర్చులు పెరగడం, ప్రత్యామ్నాయ సదుపాయాలు లభించకపోవడం ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తోంది.
