D NEWS: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మొత్తం రూ.345.78 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల హెలిప్యాడ్‌కు చేరుకున్న అనంతరం సీఎం పాదయాత్రగా సభా వేదికకు వెళ్లనున్నారు. మార్గమధ్యంలో అంబేద్కర్ చౌరస్తా, ఫూలే, నేతన్న విగ్రహాలను సందర్శించనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

సిరిసిల్లలో నేతన్న బజార్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. సిరిసిల్ల, వేములవాడలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి, సిరిసిల్ల, కోనరావుపేటలో తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా రూ.99.40 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సిరిసిల్ల, వేములవాడలో ఆర్డీవో కార్యాలయాలు, నాలుగు మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాలు, వేములవాడలో సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయ నిర్మాణాలకు కూడా శంకుస్థాపనలు చేయనున్నారు.

రుద్రంగిలో 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాములు, అనుబంధ యూనిట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. పెద్దూరులో నిర్మించిన ఇందిరా మహిళా శక్తి భవన్‌ను ప్రారంభించనున్నారు. వేములవాడలో మహిళా పోలీస్ స్టేషన్, సిరిసిల్ల, వేములవాడలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల నిర్మాణాలకు కూడా సీఎం శంకుస్థాపన చేయనున్నారు.