
D Spiritual: Dec 20: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా దీపారాధన చేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. దీపారాధన సమయంలో కొందరు ఆముదం నూనెను, మరికొందరు ఆవనూనెను, ఇంకొందరు కొబ్బరి నూనెను ఉపయోగిస్తుంటారు. అయితే పూజా కార్యక్రమాల్లో దీపారాధన చేయడానికి నువ్వుల నూనెను ఉపయోగించడం ఎంతో శ్రేష్ఠమని పండితులు చెబుతున్నారు.
దీపారాధనలో నువ్వుల నూనెకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉండడానికి శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. నువ్వుల నూనెలో సహజంగా ఉండే ‘సీస్మోల్’ అనే యాంటీ ఆక్సిడెంట్ అధిక ఉష్ణోగ్రతల్లో కూడా త్వరగా క్షీణించకుండా కాపాడుతుంది. ఆయుర్వేదంలో వంట చేయడానికి కూడా నువ్వుల నూనెను ఉత్తమమైన నూనెగా ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
వేద పండితుల అభిప్రాయం ప్రకారం నువ్వుల నూనె లేకుండా ఏ పూజా కార్యక్రమమూ సంపూర్ణంగా జరగదని చెబుతారు. యజ్ఞాలు నిర్వహించినా, పితృ పూజలు చేసినా నువ్వుల నూనెను తప్పనిసరిగా ఉపయోగిస్తారు. అందుకే పూజలకు ఉపయోగించే నూనెలలో నువ్వుల నూనెకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు.
నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల మనం ఎదుర్కొంటున్న అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని, మనసుకు ప్రశాంతత కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే శని గ్రహ ప్రభావ దోషాలు కూడా క్రమంగా తొలగిపోతాయని విశ్వాసం ఉంది.
ఈ కారణాల వల్లనే నువ్వుల నూనెతో దీపారాధన చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. భక్తిశ్రద్ధతో నిత్యం ఈ ఆచారాన్ని పాటిస్తే ఆధ్యాత్మికంగా, మానసికంగా కూడా మేలు కలుగుతుందని పెద్దలు సూచిస్తున్నారు.
