
ఐపీఎల్ 2027కు ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్ రజత్ పటిదార్ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న పటిదార్.. అసోంతో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 48 బంతుల్లోనే 8 ఫోర్లు, 13 సిక్సర్లతో అజేయంగా 135 పరుగులు చేసి జట్టుకు భారీ విజయాన్ని అందించాడు.
అసోంపై మధ్యప్రదేశ్ ఘన విజయం
సోమవారం జరిగిన ఎలైట్ గ్రూప్-సి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 250 పరుగుల భారీ స్కోరు సాధించింది. రజత్ పటిదార్‌తో పాటు శివాంగ్ కుమార్ కూడా అద్భుతంగా రాణించాడు. శివాంగ్ 38 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు.
అనంతరం 251 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అసోం బ్యాటర్లు మధ్యప్రదేశ్ బౌలర్ల ధాటికి నిలవలేకపోయారు. 17.4 ఓవర్లలో కేవలం 119 పరుగులకే ఆలౌట్ అయ్యారు. దీంతో మధ్యప్రదేశ్ 131 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నీలో ఆ జట్టుకు ఇది వరుసగా రెండో గెలుపు.
ఈ మ్యాచ్‌లో రజత్ పటిదార్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. కేవలం 25 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసిన అతడు, 41 బంతుల్లో సెంచరీ మార్కును అందుకున్నాడు. టీ20 క్రికెట్లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు ఇంగ్లండ్ ఆటగాడు డీటీ క్రిస్టియన్ (129 పరుగులు) పేరిట ఉండేది.
అంతేకాకుండా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ తరఫున సెంచరీ సాధించిన తొలి బ్యాటర్‌గా పటిదార్ చరిత్ర సృష్టించాడు. జట్టు 57/3తో కష్టాల్లో ఉన్న సమయంలో ఎనిమిదో ఓవర్లో క్రీజులోకి వచ్చిన అతడు, శివాంగ్ కుమార్‌తో కలిసి నాలుగో వికెట్‌కు కేవలం 62 బంతుల్లోనే 153 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
సూర్యకుమార్ యాదవ్ మెరుపులు.. ముంబైకి విజయం
మరోవైపు కొంతకాలంగా ఫామ్ సమస్యలతో ఇబ్బందిపడుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తన పాత దూకుడును గుర్తుచేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 29 బంతుల్లోనే 9 ఫోర్లు, 7 సిక్సర్లతో 82 పరుగులు చేసి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు.
గుజరాత్ నిర్దేశించిన 198 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సూర్యతో పాటు సర్ఫరాజ్ ఖాన్ (40 నాటౌట్) కూడా రాణించాడు. వీరిద్దరి దూకుడుతో ముంబై 15.4 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. దీంతో గుజరాత్‌పై ముంబై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ బోణీ
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో ముంబై చేతిలో పరాజయం పాలైన హైదరాబాద్, రెండో మ్యాచ్‌లో ఛత్తీస్‌గఢ్‌పై ఉత్కంఠభరిత విజయాన్ని అందుకుంది. ఈ పోరులో హైదరాబాద్ ఒక్క వికెట్ తేడాతో గెలుపొందింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఛత్తీస్‌గఢ్ 19.2 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌట్ అయింది. ఆదిత్య సింగ్ 29 బంతుల్లో 47 పరుగులతో జట్టు తరఫున అత్యధిక స్కోరు సాధించాడు. హైదరాబాద్ బౌలర్లలో అజయ్ దేవ్ గౌడ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 28 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టాడు. కెప్టెన్ చామ మిలింద్ 20 పరుగులకు మూడు వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేశాడు.
169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టుకు కూడా గట్టి పోటీ ఎదురైంది. ఛత్తీస్‌గఢ్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. అయితే హిమతేజ 37, అభిరథ్ 34 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌లు ఆడగా, చివర్లో తనయ్ త్యాగరాజన్ 19 పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చాడు.
ఒక్క వికెట్ తేడాతో సాధించిన ఈ విజయంతో హైదరాబాద్ టోర్నీలో బోణీ కొట్టింది. మొత్తంగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రజత్ పటిదార్ విధ్వంసకర బ్యాటింగ్, సూర్యకుమార్ యాదవ్ పునరాగమన ఫామ్, హైదరాబాద్ తొలి విజయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
