
DSports 18Feb 2026:కొలంబో: టీ20 వరల్డ్ కప్ 2026లో గ్రూప్-ఎ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. నేడు మధ్యాహ్నం 3 గంటలకు కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ (SSC) మైదానంలో పాకిస్థాన్ తన చివరి లీగ్ మ్యాచ్‌లో నమీబియాతో తలపడాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు చూస్తుంటే మ్యాచ్ సజావుగా సాగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
- ఆక్యూవెదర్ నివేదిక ప్రకారం, మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి (మధ్యాహ్నం 3 గంటలకు) కొలంబోలో వర్షం కురిసే అవకాశం 67 శాతం వరకు ఉంది. ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉండి, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు వర్షం తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో టాస్ పడటం కూడా ఆలస్యం కావొచ్చు.సాధారణంగా మ్యాచ్ రద్దయితే జట్లు నిరాశ చెందుతాయి, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వర్షం కురిస్తే పాకిస్థాన్‌కు అది ‘వరప్రసాదం’ లాంటిది.
- ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే, ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. అప్పుడు పాకిస్థాన్ పాయింట్లు 5కు చేరుతాయి. అమెరికా (USA) ఇప్పటికే తమ అన్ని లీగ్ మ్యాచులు ముగించి 4 పాయింట్లతో ఉంది. పాకిస్థాన్ ఖాతాలో 5 పాయింట్లు చేరితే, మెరుగైన రన్ రేట్ అవసరం లేకుండానే పాక్ నేరుగా సూపర్-8కు అర్హత సాధిస్తుంది. అమెరికా టోర్నీ నుండి నిష్క్రమిస్తుంది.ఒకవేళ వాన తగ్గి మ్యాచ్ గనుక జరిగితే, పాకిస్థాన్ ఖచ్చితంగా గెలవాలి. ఎందుకంటే నమీబియాపై ఓడిపోతే మాత్రం పాక్ ఇంటిదారి పట్టాల్సి వస్తుంది. ఇప్పటికే మూడు ఓటములతో నమీబియా టోర్నీ నుండి నిష్క్రమించినప్పటికీ, చివరి మ్యాచ్‌లో పాక్‌కు షాక్ ఇచ్చి టోర్నీని ముగించాలని చూస్తోంది.
