
D NEWS: ఏదులాపురం మున్సిపాలిటీలో కొనసాగుతున్న ఇంటిగ్రేటెడ్ కార్యాలయాల భవన నిర్మాణ పనులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వరంగల్ క్రాస్ రోడ్డులోని తరుణీ హట్ ప్రాంగణంలో మంగళవారం ఉదయం పనులను పరిశీలించారు.
నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని మంత్రి అధికారులను ఆదేశించారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి భవనాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
ఇంటిగ్రేటెడ్ కార్యాలయాల భవనం పూర్తయితే ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వివిధ ప్రభుత్వ శాఖల సేవలు ఒకే చోట అందుబాటులోకి వస్తాయని పొంగులేటి తెలిపారు. దీంతో ప్రజలు వివిధ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గుతుందని పేర్కొన్నారు.
ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా అందించడమే లక్ష్యంగా కార్యాలయ సముదాయాన్ని నిర్మిస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని పొంగులేటి మరోసారి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భవనం పూర్తయిన తర్వాత ప్రజలకు ఒకేచోట ప్రభుత్వ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
