
Polio | ప్రపంచవ్యాప్తంగా పోలియో కేసులు గణనీయంగా తగ్గినప్పటికీ, కొన్ని దేశాల్లో ఇప్పటికీ ఈ వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ముఖ్యంగా ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ దేశాల్లో సహజ పోలియో వైరస్ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. టీకాల కొరత, యుద్ధ పరిస్థితులు, అపరిశుభ్రత, టీకాలపై అపోహలు ఈ వ్యాధి నిర్మూలనకు ప్రధాన అడ్డంకులుగా మారుతున్నాయి. అసలు పోలియో వైరస్ ఎలా వ్యాపిస్తుంది? టీకాలు అందుబాటులో ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఈ వ్యాధి ఎందుకు కొనసాగుతోంది?
పోలియో అనేది ప్రాణాంతక పరిణామాలకు దారితీసే అంటువ్యాధి. ఈ వైరస్ ప్రధానంగా మనిషి పేగుల్లో నివసిస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తి మలంలోని వైరస్ సూక్ష్మక్రిములు కలుషితమైన చేతులు, ఆహారం, నీటి ద్వారా ఇతరుల శరీరంలోకి ప్రవేశిస్తాయి. ముఖ్యంగా పారిశుద్ధ్య పరిస్థితులు సరిగా లేని ప్రాంతాల్లో వైరస్ వేగంగా వ్యాపించే అవకాశం ఉంటుంది. చాలామందిలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా, వారి ద్వారా ఇతరులకు వైరస్ సంక్రమించవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి 200 పోలియో వైరస్ సంక్రమణల్లో ఒకటి తీవ్రమైన పరిణామానికి దారితీస్తుంది. ఈ సందర్భంలో వైరస్ కండరాల కదలికలను నియంత్రించే నరాలపై దాడి చేస్తుంది. ముఖ్యంగా కాళ్లకు సంబంధించిన నరాలు దెబ్బతినడంతో బాధితులు శాశ్వత పక్షవాతానికి గురయ్యే ప్రమాదం ఉంది. పోలియోకు ప్రత్యేకమైన చికిత్స అందుబాటులో లేకపోయినా, టీకాల ద్వారా ఈ వ్యాధి నుంచి సమర్థవంతమైన రక్షణ పొందవచ్చు.
3.5 లక్షల మంది చిన్నారులకు పక్షవాతం
1988లో ప్రపంచవ్యాప్తంగా 125 దేశాల్లో సుమారు 3.5 లక్షల మంది చిన్నారులు పోలియో కారణంగా పక్షవాతానికి గురయ్యారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అదే ఏడాది ప్రపంచ దేశాలు సంయుక్తంగా పోలియో నిర్మూలన కార్యక్రమాన్ని ప్రారంభించాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ప్రయత్నాల ఫలితంగా పోలియో కేసులు 99 శాతానికి పైగా తగ్గాయి.
గతంలో సహజ పోలియో వైరస్‌లో మూడు రకాలు ఉండేవి. ప్రస్తుతం మొదటి రకం వైరస్ మాత్రమే సహజంగా వ్యాప్తిలో ఉంది. ఈ వైరస్ వ్యాప్తి ప్రధానంగా ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ దేశాలకే పరిమితమైంది. 2025లో ఈ రెండు దేశాల్లో 52 మంది చిన్నారులు పోలియో కారణంగా పక్షవాతానికి గురయ్యారు.
అయితే ఈ దేశాల్లో పోలియో నిర్మూలనకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. యుద్ధ వాతావరణం, భద్రతాపరమైన సమస్యలు, టీకాలు వేసే సిబ్బందిపై దాడులు వంటి కారణాలతో కొన్ని ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి చిన్నారులకు టీకాలు అందించడం కష్టంగా మారింది. దీంతో టీకాలు అందని పిల్లల సంఖ్య పెరిగి వైరస్ వ్యాప్తికి అవకాశాలు ఏర్పడుతున్నాయి.
పోలియో మళ్లీ వ్యాప్తి చెందడానికి కారణాలేమిటి?
సహజ పోలియో వైరస్‌తో పాటు టీకా ద్వారా ఉత్పన్నమయ్యే పోలియో వైరస్ (Vaccine-derived Poliovirus) కూడా కొన్ని ప్రాంతాల్లో సమస్యగా మారుతోంది. నోటిద్వారా ఇచ్చే పోలియో చుక్కల్లో బలహీనపరిచిన వైరస్ ఉంటుంది. ఇది చిన్నారుల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
టీకా తీసుకున్న పిల్లల మలం ద్వారా ఈ బలహీన వైరస్ కొంతకాలం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. చుట్టుపక్కల పిల్లలకు కూడా టీకాలు పూర్తిస్థాయిలో అందితే వైరస్ వ్యాప్తి చెందకుండా అంతమవుతుంది. కానీ టీకాలు తీసుకోని పిల్లలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తూ జన్యుపరమైన మార్పులకు లోనవుతుంది. కొన్నిసార్లు తిరిగి పక్షవాతం కలిగించే సామర్థ్యాన్ని సంతరించుకుంటుంది.
అయితే దీనికి కారణం పోలియో టీకా తీసుకోవడమే కాదు. సమాజంలో తగినంతమంది చిన్నారులకు టీకాలు అందకపోవడమే ప్రధాన సమస్య. ముఖ్యంగా 80 శాతం కంటే తక్కువ మంది పిల్లలకు టీకాలు అందిన ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
పేద కుటుంబాలు, మారుమూల గ్రామాలు, యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో నివసించే చిన్నారులకు టీకాలు అందించడం ఆరోగ్య శాఖలకు పెద్ద సవాలుగా మారుతోంది. మరోవైపు టీకాలపై తప్పుడు ప్రచారం, అపోహలు కూడా నిర్మూలన కార్యక్రమానికి ఆటంకం కలిగిస్తున్నాయి. 2003లో నైజీరియాలో టీకాలపై తప్పుడు ప్రచారం కారణంగా కొన్ని ప్రాంతాల్లో టీకా కార్యక్రమం నిలిచిపోయింది. దీంతో అక్కడ పోలియో మళ్లీ విజృంభించింది.
అంతర్జాతీయ ప్రయాణాలతో ఇతర దేశాలకూ ముప్పు
పోలియో వైరస్ ఒక దేశానికే పరిమితమయ్యే వ్యాధి కాదు. అంతర్జాతీయ ప్రయాణాలు, వలసల ద్వారా వైరస్ ఇతర దేశాలకు కూడా చేరే ప్రమాదం ఉంది. ఇందుకు 2025 అక్టోబర్‌లో జర్మనీలోని హాంబర్గ్‌లో వెలుగుచూసిన ఘటన ఉదాహరణగా నిలుస్తోంది.
అక్కడి మురుగునీటి నమూనాలను పరీక్షించగా సహజ పోలియో వైరస్ ఆనవాళ్లు గుర్తించారు. వాటి జన్యు లక్షణాలు ఆఫ్ఘనిస్థాన్‌లో గుర్తించిన వైరస్‌తో సరిపోలాయి. అయితే జర్మనీలో చిన్నారులకు టీకాలు అందుబాటులో ఉండటంతో పక్షవాతం కేసులు నమోదుకాలేదు. ఈ ఘటన పోలియో నిర్మూలన పూర్తయ్యే వరకు ప్రపంచంలోని ఏ దేశమూ పూర్తిగా నిర్లక్ష్యం చేయలేదని స్పష్టం చేస్తోంది.
మరోవైపు, 2026లో ప్రపంచ పోలియో నిర్మూలన కార్యక్రమానికి కేటాయించిన నిధులు 30 శాతం తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. నిధుల కొరత కారణంగా కొన్ని ప్రాంతాల్లో టీకా కార్యక్రమాలను కొనసాగించడం కష్టమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. ఇది ఇప్పటికే సాధించిన పురోగతిని వెనక్కి నెట్టే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పోలియో నిర్మూలనకు సమష్టి కృషి అవసరం
ఇప్పటివరకు మశూచి (Smallpox) వ్యాధి మాత్రమే ప్రపంచవ్యాప్తంగా పూర్తిగా నిర్మూలించబడింది. పోలియోను కూడా రెండో నిర్మూలిత వ్యాధిగా మార్చే లక్ష్యంతో అంతర్జాతీయ స్థాయిలో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ లక్ష్యాన్ని సాధించాలంటే ప్రతి చిన్నారికి పూర్తి స్థాయిలో టీకాలు అందించాలి.
ముఖ్యంగా యుద్ధ ప్రాంతాలు, మారుమూల గ్రామాలు, పేదరికం ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. టీకాలపై ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రజల్లో అవగాహన పెంచాలి. అంతేకాకుండా పోలియో నిర్మూలన కార్యక్రమాలకు అవసరమైన నిధులను నిరంతరంగా అందించాలి. ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా వైరస్ ఉనికి ఉన్నంతకాలం మిగతా దేశాలకూ ముప్పు తప్పదు. అందువల్ల అంతర్జాతీయ సహకారం, నిరంతర టీకా కార్యక్రమాలే పోలియో రహిత ప్రపంచానికి మార్గం.
