
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా దమనకాండ కొనసాగుతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. రజాకార్ల పాలనలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులకు, జరిగిన రక్తపాతానికి చారిత్రక గుర్తులు ఇప్పటికీ కనిపిస్తాయని పేర్కొన్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చొరవతోనే తెలంగాణకు విముక్తి లభించిందని తెలిపారు.
మంగళవారం హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడిన కిషన్‌రెడ్డి నిజాం పాలనకు ముగింపు పలకడంతో 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ గడ్డకు విముక్తి లభించిందన్నారు. అయితే ఈ విమోచన చరిత్రను గత పాలకులు తొక్కిపెట్టారని విమర్శించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్లు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించడానికి ఎందుకు భయపడుతున్నాయని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఎంఐఎం ఒత్తిళ్లకు తలొగ్గి ఈ రెండు పార్టీలు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ద్రోహం చేస్తున్నాయని ఆరోపించారు.
1990ల నుంచే హైదరాబాద్ ముక్తి దివస్ నిర్వహణ కోసం అనేక పోరాటాలు చేశామని ఆయన గుర్తుచేశారు. గత ఐదేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు.
తెలంగాణ విమోచన దినోత్సవం రాజకీయ కార్యక్రమం కాదని నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ప్రతీక అని కిషన్‌రెడ్డి అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం ప్రభుత్వాల బాధ్యత అని పేర్కొన్నారు. సెప్టెంబర్ 17న నిర్వహించే విమోచన వేడుకలకు హైదరాబాద్, తెలంగాణ ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఈ వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతితో పాటు పలువురు కేంద్ర మంత్రులు పాల్గొంటారని కిషన్‌రెడ్డి వెల్లడించారు. సెప్టెంబర్ 17ను ‘విలీనం’ లేదా ‘విద్రోహం’గా అభివర్ణించే వారికి తాము ‘తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవం’గా పేర్కొంటామని తెలిపారు. మరోవైపు ప్రధాని మోదీపై సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న విమర్శలపై సమయం వచ్చినప్పుడు స్పందిస్తామని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.
