
D News: ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒకానొక సమయంలో తీసుకునే నిర్ణయం మొత్తం జీవితాన్నే మార్చేస్తుందని, అదే ‘సిగ్మా’ సినిమా కథకు మూలమని దర్శకుడు జాసన్ సంజయ్ తెలిపారు. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.
జీవితాన్ని మార్చే ఆ ఒక్క క్షణమే ‘సిగ్మా’
సేలంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో జాసన్ సంజయ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి జీవితంలో కచ్చితంగా ఒక ‘సిగ్మా’ క్షణం ఉంటుందని చెప్పారు. కష్టాల్లో ఉన్నప్పుడు వాటి నుంచి బయటపడేందుకు మనం తీసుకునే ఒక నిర్ణయమే ఆ క్షణమని, అదే తన సినిమా కథకు ఆధారమని వివరించారు.
సేలం నుంచి ప్రమోషన్స్ ప్రారంభించడం తనకు ప్రత్యేకమని జాసన్ తెలిపారు. ఈ ప్రాంతంలో సుమారు పది రోజుల పాటు షూటింగ్ చేశామని, అక్కడ షూటింగ్ సమయంలో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఏర్పడ్డాయని చెప్పారు. అక్టోబర్ 2న విడుదల కానున్న సినిమాకు ప్రేక్షకులు తమ మద్దతు ఇవ్వాలని కోరారు.
జాసన్‌పై సందీప్, ఫరియా ప్రశంసలు
సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ఇలాంటి సినిమా చేయడం చాలా అరుదని, జాసన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేలా ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో కష్టపడ్డారని అన్నారు. ‘సిగ్మా’ తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఫరియా అబ్దుల్లా కూడా జాసన్ సంజయ్‌పై ప్రశంసలు కురిపించారు. సినిమాపై, చిత్ర నిర్మాణంపై ఆయనకు ఎంతో ఆసక్తి ఉందని, తాను అనుకున్నది తెరపైకి తీసుకురావడంలో ఆయనకు స్పష్టమైన ఆలోచన ఉందని చెప్పారు.
లైకా ప్రొడక్షన్స్‌కు ‘సిగ్మా’ ప్రత్యేకం
నిర్మాత జీకేఎం తమిళ్‌కుమరన్ మాట్లాడుతూ.. ‘సిగ్మా’ జాసన్ సంజయ్‌కు మాత్రమే కాకుండా లైకా ప్రొడక్షన్స్‌కు కూడా ఎంతో ప్రత్యేకమైన చిత్రమని అన్నారు. జాసన్‌ను దర్శకుడిగా పరిచయం చేయడం తమకు గర్వకారణమని తెలిపారు.
గతంలో ‘కోలమావు కోకిల’తో నెల్సన్ దిలీప్ కుమార్‌ను, ‘డాన్’తో సిబి చక్రవర్తిని దర్శకులుగా పరిచయం చేశామని గుర్తుచేసిన ఆయన.. జాసన్ కూడా భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లాతో పాటు రజు సుందరం, సంపత్ రాజ్, శివ పండిట్ తదితరులు నటించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. అక్టోబర్ 2న ‘సిగ్మా’ థియేటర్లలోకి రానుంది.
