
D Spiritual: Sept 26: శ్రీశైలం దర్శనం, ఆర్జిత సేవల టికెట్లు విడుదల
శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు దేవస్థానం పాలకమండలి కీలక అప్‌డేట్ అందించింది. అక్టోబర్ నెలకు సంబంధించిన శ్రీస్వామివారి స్పర్శదర్శనం, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనాలతో పాటు వివిధ ఆర్జిత సేవల టికెట్లను విడుదల చేసినట్లు పాలకమండలి ఛైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
మనమిత్ర వాట్సాప్, వెబ్‌సైట్ ద్వారా బుకింగ్
భక్తులు టికెట్లను సులభంగా బుక్ చేసుకునేందుకు దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మొత్తం టికెట్లలో 80 శాతం టికెట్లను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ‘మనమిత్ర’ వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. పరోక్ష సేవలకు సంబంధించిన టికెట్లను కూడా ఇదే వాట్సాప్ నంబర్ ద్వారా పొందవచ్చు.
మిగిలిన 20 శాతం టికెట్లను దేవాదాయ శాఖ అధికారిక వెబ్‌సైట్ tms.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆయా సేవలు ప్రారంభమయ్యే సమయానికి గంట ముందు వరకు టికెట్లు అందుబాటులో ఉంటే వాట్సాప్ లేదా ఆన్‌లైన్ ద్వారా బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. బుకింగ్ ప్రక్రియలో భక్తులకు సహాయం చేసేందుకు దేవస్థానం పరిధిలోని పలు ప్రాంతాల్లో వాట్సాప్ సహాయ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు.
14 రకాల ఆర్జిత సేవలు అందుబాటులో
శ్రీస్వామివారి గర్భాలయ అభిషేకం, సామూహిక అభిషేకం, కుంకుమార్చన, గణపతి హోమం, రుద్రహోమం, మహామృత్యుంజయ హోమం, చండీహోమం, కల్యాణోత్సవం, అన్నప్రాశన, అక్షరాభ్యాసం తదితర 14 రకాల ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్లు అందుబాటులో ఉన్నాయి.
శని, ఆదివారాలు, సోమవారాలు, పర్వదినాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ముందస్తు టికెట్లు లభించని భక్తులు మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
టికెట్ ఉన్న భక్తులకు నిబంధనలు
ఆర్జిత సేవల టికెట్లు పొందిన భక్తులు కొన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ఆన్‌లైన్ లేదా వాట్సాప్ ద్వారా బుక్ చేసుకున్న టికెట్ హార్డ్‌కాపీతో పాటు ఒరిజినల్ లేదా జిరాక్స్ ఆధార్ కార్డును వెంట తీసుకురావాలి. టికెట్‌ను స్కాన్ చేసి, భక్తుల గుర్తింపు వివరాలను పరిశీలించిన తర్వాతే ఆర్జిత సేవల్లోకి అనుమతిస్తారు.
మరోవైపు ఉచిత సర్వదర్శనం మాత్రం ప్రతిరోజూ ఉదయం 4.30 గంటల నుంచి యథావిధిగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
దసరా ఉత్సవాల సమయంలో దర్శనాలు, సేవల్లో మార్పులు
అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు దసరా మహోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఆలయంలో దర్శనాలు, పలు ఆర్జిత సేవల్లో మార్పులు చేశారు. ఈ పది రోజుల పాటు రాత్రి వేళల్లో శ్రీస్వామివారి స్పర్శదర్శనాన్ని నిలిపివేయనున్నారు. అలాగే అమ్మవారి ఆర్జిత కుంకుమార్చనలను ఉదయం నిర్వహించకుండా సాయంత్రం, రాత్రి వేళల్లో మాత్రమే నిర్వహించనున్నారు.
దసరా ఉత్సవాల కారణంగా అక్టోబర్ 11 నుంచి 20 వరకు గణపతి హోమం, రుద్రహోమం, మృత్యుంజయ హోమం, చండీహోమం, లక్ష కుంకుమార్చన, నవావరణ పూజ, సువర్ణపుష్పార్చనతో పాటు ఉదయాస్తమాన సేవ, ప్రదోషకాల సేవ, ప్రాతఃకాల సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు.
దర్శనాలు, సేవల్లో చేసిన ఈ మార్పులను భక్తులు ముందుగానే గమనించి తమ శ్రీశైలం ఆలయ దర్శన ప్రయాణాన్ని అందుకు అనుగుణంగా ప్రణాళిక చేసుకోవాలని అధికారులు సూచించారు.
