
DNews: Jan 05: నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం బోర్గావ్ గ్రామంలో ఒక భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. పత్తాటి రమేష్ (35) అనే వ్యక్తిని అతని భార్య సౌమ్య మరియు ఆమె ప్రియుడు దిలీప్ కలిసి ఉరి వేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. సౌమ్య ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తూ అక్కడే పీఈటీగా పనిచేసే దిలీప్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా అక్రమ సంబంధంగా మారింది. ఈ విషయం భర్త రమేష్‌కు తెలిసిన తర్వాత, అతను ఇద్దరినీ గట్టిగా హెచ్చరించాడు. దీంతో సౌమ్య తన భర్తను అడ్డంకిగా భావించి తొలగించాలని నిర్ణయించింది. గత నెల 20న ఆమె తన ప్రియుడితో కలిసి ఇంట్లోనే తువ్వాలతో రమేష్‌ను ఉరి వేసింది. అనంతరం రమేష్ గుండెపోటుతో మరణించాడని నటిస్తూ, ఎవరూ అనుమానం రాకుండా త్వరగా అంత్యక్రియలు పూర్తి చేసింది. అయితే అంత్యక్రియల సమయంలో రమేష్ మెడపై గాట్లు కనిపించడంతో గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే ఇజ్రాయెల్‌లో ఉన్న రమేష్ తమ్ముడు కేదారి కి సమాచారం అందించి, అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో నిజం బయటపడగా, సౌమ్య తన భర్తను అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నందున హత్య చేసినట్లు ఒప్పుకుంది. ఈ కేసులో సౌమ్యతో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. గ్రామస్తులు పదమూడు సంవత్సరాల వైవాహిక జీవితం, ముగ్గురు పిల్లలు ఉన్న రమేష్‌ను అన్యాయంగా హత్య చేసిన సౌమ్యకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
