
ఏడు నెలల విరామం తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ పార్టీ కొత్త జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు. పార్టీ భవిష్యత్ వ్యూహాలు, సంస్థాగత బలోపేతాన్ని దృష్టిలో పెట్టుకుని కీలక పదవుల్లో మార్పులు, చేర్పులు చేశారు. సీనియర్ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించడంతో పాటు, పలువురిని వారి ప్రస్తుత పదవుల్లోనే కొనసాగించారు.
కొత్త కార్యవర్గంలో 13 మందిని జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించారు. ఇందులో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రామ్ మాధవ్, పురంధేశ్వరి వంటి నేతలకు చోటు దక్కింది. తెలంగాణకు చెందిన డీకే అరుణను జాతీయ ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పించారు. కొత్త జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు ప్రాతినిధ్యం లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
జాతీయ ప్రధాన కార్యదర్శులుగా ఎనిమిది మందిని నియమించారు. మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న బీఎల్ సంతోష్‌ను సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా కొనసాగించారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విష్ణువర్ధన్‌రెడ్డికి కూడా కొత్త బృందంలో కీలక బాధ్యత దక్కింది. ఆయనను జాయింట్ కో-ఆర్డినేటర్‌గా నియమించారు. కేంద్ర కార్యాలయ ఇన్చార్జ్గా తరుణ్ చుగ్‌ను నియమించారు. అలాగే ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్షుడిగా అమర్‌పాల్ మౌర్యను నియమించారు.
పార్టీ ఆర్థిక వ్యవహారాల్లోనూ మార్పులు చేశారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను పార్టీ కోశాధికారిగా నియమించారు. ఇప్పటివరకు ఈ బాధ్యతలు నిర్వహించిన రాజేష్ అగర్వాల్ స్థానంలో గోయల్ బాధ్యతలు చేపట్టనున్నారు. రాజేష్ మంగళ్‌ను సహ-కోశాధికారిగా నియమించారు. ఇక బీజేపీ మీడియా వ్యవహారాల బాధ్యతలను అనిల్ బలూని కొనసాగించనున్నారు. పార్టీ మీడియా కమ్యూనికేషన్, ప్రచార వ్యూహాల్లో ఆయన కీలకంగా వ్యవహరించనున్నారు.
