
తెలంగాణలోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. స్వయం ఉపాధి పొందాలనుకునే యువతకు ఆర్థిక సాయం అందించేందుకు అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాసం పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు రూ.లక్ష చొప్పున సాయం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
ఈ పథకానికి ఇప్పటికే యువత నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం అర్హులైన వారిని ఎంపిక చేసి తుది జాబితాను సిద్ధం చేసింది. తాజాగా లబ్ధిదారులకు ఆర్థిక సాయం పంపిణీ చేసే ప్రక్రియకు ప్రభుత్వం తేదీని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. నవంబర్ 19 నుంచి అర్హులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
ఈ మేరకు ప్రజాభవన్‌లో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాజీవ్ యువ వికాసం పథకంపై చర్చించారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూడా పాల్గొన్నారు. అర్హులైన యువతకు నగదు సాయం త్వరగా అందేలా అవసరమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు.
నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పొందేలా ప్రోత్సహించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వం అందించే ఆర్థిక సాయంతో లబ్ధిదారులు తమకు ఆసక్తి ఉన్న రంగాల్లో ఉపాధి అవకాశాలను సృష్టించుకునే అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువత ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందనున్నారు.
రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి మార్చి 17 నుంచి ఏప్రిల్ 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేశారు. ప్రస్తుతం ఎంపికైన లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. నగదు సాయాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.
