D Educt: Nov 5: వైద్య రంగంలో నైపుణ్య మానవ వనరుల తయారీకి వైఐఎస్‌యూ, ఏఐజీ ఆసుపత్రుల కృషి

వైద్య రంగానికి అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను తీర్చిదిద్దే లక్ష్యంతో యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ (వైఐఎస్‌యూ), ఏఐజీ ఆసుపత్రులు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా స్కిల్స్‌ యూనివర్సిటీలో బీఎస్సీ కార్డియోవాస్క్యులర్‌ టెక్నాలజీ (సీవీటీ) కోర్సును ప్రవేశపెట్టేందుకు అవసరమైన ఏర్పాట్లను ముమ్మరం చేశాయి.

ఈ కోర్సు ప్రారంభానికి సంబంధించి నవంబరు 4న హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించారు. ఏఐజీ ఆసుపత్రుల ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ డి. నాగేశ్వరరెడ్డి, యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ వి.ఎల్‌.వి.ఎస్‌. సుబ్బారావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇరు సంస్థలకు చెందిన విద్య, వైద్య రంగాల నిపుణులు కూడా హాజరయ్యారు.

కోర్సులో ప్రవేశం పొందేందుకు అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు, ఫీజుల నిర్ధారణ, పాఠ్య ప్రణాళిక రూపకల్పన, పాఠ్యాంశాల్లో చేయాల్సిన మార్పులపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. విద్యార్థులకు వైద్య రంగానికి అవసరమైన నైపుణ్యాలను అందించేలా కోర్సు రూపకల్పన చేయడంపై నిపుణులు దృష్టి సారించారు.

పరిశ్రమలు, విద్యాసంస్థల భాగస్వామ్యంతో ఉపాధి అవకాశాలకు అనుగుణమైన విద్యను అందించడమే యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ లక్ష్యమని డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి తెలిపారు. ఈ లక్ష్య సాధనలో భాగంగానే వైఐఎస్‌యూ, ఏఐజీ ఆసుపత్రులు కలిసి పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *