
ప్రజా ప్రదేశాల్లో ఎమ్మెల్యేలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మహిళా కానిస్టేబుళ్ల ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు షర్టులు విప్పడం ఆమోదయోగ్యం కాదని ఆమె స్పష్టం చేశారు.
సోమవారం అసెంబ్లీ వద్ద చోటుచేసుకున్న ఘటనపై ఇతర సంఘాల ప్రతినిధులతో కలిసి మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు పద్మావతి తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆమె మాట్లాడుతూ ఘటనకు సంబంధించిన అన్ని ఆధారాలను మహిళా కమిషన్‌కు సమర్పించినట్లు వెల్లడించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చర్య మహిళా గౌరవానికి భంగం కలిగించేలా ఉందని ఆమె ఆరోపించారు. బాధ్యులైన ఎమ్మెల్యేలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మహిళల గౌరవం, భద్రతకు మహిళా కమిషన్ ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని పద్మావతి పేర్కొన్నారు. మహిళా నేతలకు రక్షణ కల్పించేందుకే పోలీసులు ప్రయత్నించారని స్పష్టం చేశారు. మహిళా కానిస్టేబుల్ తలదించుకుని నిలబడాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని, ఇది అత్యంత దారుణమైన ఘటన అని ఆమె అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని పద్మావతి తెలిపారు.
