
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఎనిమిదో రోజు ప్రారంభమైన సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల అంశాన్ని సభలో ప్రస్తావించారు. హైదరాబాద్‌లోని 15 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఇళ్ల కేటాయింపుల విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
తన నియోజకవర్గానికి కేటాయించిన ఇళ్లలో ఇతర నియోజకవర్గాలకు చెందిన వారికి ఇళ్లు కేటాయించారని దానం నాగేందర్ పేర్కొన్నారు. మలక్‌పేటకు చెందిన లబ్ధిదారులకు ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఇళ్లు కేటాయించారని, ఇళ్ల కేటాయింపుల ప్రక్రియలో నిబంధనలు పాటించలేదని ఆరోపించారు.
అర్హులైన లబ్ధిదారులకు వారి సొంత నియోజకవర్గంలోనే ఇళ్లు కేటాయించాలని ఆయన కోరారు. ప్రజాప్రతినిధులందరికీ సమాన గౌరవం ఉండాలని అధికారులు ప్రజాప్రతినిధులను చూసి భయపడి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి ఎమ్మెల్యేకూ తమ నియోజకవర్గ ప్రజల సమస్యలపై పోరాడే హక్కు ఉందని స్పష్టం చేశారు.
తాను ఇచ్చిన ప్రివిలేజ్ నోటీసును ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు చేయలేదని దానం నాగేందర్ సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులపై అధికారులు 360 డిగ్రీల స్క్రూటినీ జరిగిందని చెబుతున్నారని అలాంటప్పుడు పొరపాటు ఎక్కడ జరిగిందని ఆయన ప్రశ్నించారు. పరిశీలన జరిగినప్పటికీ తప్పిదం జరిగితే సంబంధిత అధికారుల బాధ్యతను నిర్ధారించి చర్యలు తీసుకోవాలని దానం నాగేందర్ కోరారు.
