SDports 22Jan 2026:ముంబై: భారత క్రికెట్ చరిత్రలో ఒక శకం ముగిసింది. 2007లో ప్రారంభమైన టీ20 ప్రపంచకప్ మొదటి ఎడిషన్ నుండి మొన్నటి 2024 విశ్వవిజేత వరకు ప్రతి టోర్నీలోనూ భాగమైన ఏకైక భారత ఆటగాడు రోహిత్ శర్మ. అయితే, ఫిబ్రవరి 2026లో భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ మైదానంలో కనిపించడు. ఈ నేపథ్యంలో, తొలిసారి ఒక మెగా టోర్నీని బయట నుండి చూడటంపై రోహిత్ శర్మ తాజాగా స్పందిస్తూ భావోద్వేగానికి గురయ్యాడు.

  • ఓ ఇంటర్వ్యూలో రోహిత్ మాట్లాడుతూ, ప్రపంచకప్ మ్యాచ్‌లను టీవీలో చూడటం తనకెంతో వింతగా అనిపిస్తుందని పేర్కొన్నాడు. “మేము ఇంట్లో దీని గురించే చర్చించుకుంటున్నాము. 2007 నుండి ఇప్పటివరకు నేను ప్రతి టీ20 వరల్డ్ కప్‌లో ఆడాను. ఇప్పుడు తొలిసారి ఇంట్లో కూర్చుని మ్యాచ్‌లు చూడటం చాలా భిన్నంగా, కొంచెం వింతగా (Weird) అనిపిస్తుంది,” అని రోహిత్ తెలిపాడు.
  • ద్వైపాక్షిక సిరీస్‌లు మిస్ అయినప్పుడు పెద్దగా అనిపించదు కానీ, వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నీలో భాగం కాకపోతే ఆ వెలితి స్పష్టంగా తెలుస్తుందని రోహిత్ అన్నాడు. “సాధారణ టీ20 మ్యాచ్‌లు చూస్తున్నప్పుడు నేను జట్టులో లేననే బాధ అంతగా ఉండదు. కానీ వరల్డ్ కప్ వస్తుంటే మాత్రం.. ‘నేను అందులో లేను కదా’ అనే వాస్తవం మనసులో బలంగా నాటుకుపోతుంది. అది మనసును కాస్త కలచివేస్తుంది,” అని ఉద్వేగంగా చెప్పాడు.
  • రోహిత్ శర్మ మైదానంలో ఆడకపోయినా, ఈ 2026 టీ20 ప్రపంచకప్‌కు ఐసీసీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు. దీనిపై స్పందిస్తూ.. “నేను మైదానంలో ఉండకపోవచ్చు కానీ, స్టేడియంలో ఎక్కడో ఒక చోట ఉండి జట్టును ప్రోత్సహిస్తాను. అంబాసిడర్‌గా ఉండటం నాకు దక్కిన గౌరవం. ఒక ప్రేక్షకుడిగా మ్యాచ్‌లు చూడటం కూడా ఒక కొత్త అనుభవమే,” అని ఆశాభావం వ్యక్తం చేశాడు.