
D Educt: Oct 5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. పాఠశాలల్లో వసతుల కల్పనకు నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి అంశాలపై సోమవారం ఉండవల్లిలోని తన నివాసంలో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
సమీక్షలో భాగంగా పాఠశాలల అప్‌గ్రేడేషన్, “లీప్ స్కూళ్ల” ఏర్పాటు తదితర అంశాలపై మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని వన్-స్టార్ పాఠశాలలన్నింటినీ ఏడాదిలోగా టూ-స్టార్ స్థాయికి అప్‌గ్రేడ్ చేయాలని స్పష్టం చేశారు. అదే విధంగా ప్రస్తుత విద్యా సంవత్సరంలోగా జీరో-స్టార్ రేటింగ్ ఉన్న అన్ని పాఠశాలలను కనీసం వన్-స్టార్ స్థాయికి తీసుకురావాలని సూచించారు.
2029 నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను 4-స్టార్ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని నారా లోకేశ్ ఆదేశించారు. కనీసం వెయ్యి పాఠశాలలను 5-స్టార్ స్థాయికి చేర్చేలా పటిష్ఠమైన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ముఖ్యంగా ఏజెన్సీ, వెనుకబడిన ప్రాంతాల్లోని పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులను కోరారు.
ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 175 “లీప్ స్కూళ్లను” అభివృద్ధి చేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. ఈ పాఠశాలలను విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం, ఆధునిక వసతులు అందించేలా అభివృద్ధి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 1,685 వన్-స్టార్, 15,618 టూ-స్టార్, 19,099 త్రీ-స్టార్, 7,172 ఫోర్-స్టార్ పాఠశాలలు ఉన్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పురోగతిపై డీఈవోలు, ఎంఈవోలు, సీఆర్‌పీలకు బాధ్యతలు అప్పగించాలని లోకేశ్ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 7 వేల హైస్కూళ్లలో పూర్తిస్థాయిలో కంప్యూటర్ ల్యాబ్‌లు, అటల్ టింకరింగ్ ల్యాబ్‌ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
అకడమిక్ సంస్కరణలు పూర్తయినందున ఇకపై అధికారులు, ఉపాధ్యాయులు పూర్తిగా విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరచడంపైనే దృష్టి సారించాలని మంత్రి పిలుపునిచ్చారు. విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా బోధన, అభ్యసన ప్రక్రియలను మరింత బలోపేతం చేయాలని సూచించారు.
విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి కూడా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని నారా లోకేశ్ తెలిపారు. విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించేందుకు కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY) ద్వారా ఈ ఏడాది 5 లక్షల మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించాలని లక్ష్యంగా నిర్దేశించారు.
అదేవిధంగా ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్, నేషనల్ అప్రెంటిస్‌షిప్ స్కీమ్‌లను విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలని మంత్రి సూచించారు. నిరుద్యోగ యువతను “నైపుణ్యం పోర్టల్” పరిధిలోకి తీసుకువచ్చి, కృత్రిమ మేధ (AI) సాంకేతికత ద్వారా వారికి ఇంటర్వ్యూలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సీడాప్, ఓంక్యాప్‌ల ఆధ్వర్యంలో జర్మన్, జపనీస్ వంటి విదేశీ భాషల్లో శిక్షణ అందించి, యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని అధికారులను నారా లోకేశ్ ఆదేశించారు. విద్యార్థులు, నిరుద్యోగ యువతలో నైపుణ్యాలను పెంపొందించి మెరుగైన ఉపాధి అవకాశాలు అందేలా సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు.
ఈ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో మానవ వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు, ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ రంజిత్ బాషా, రాష్ట్ర విద్యా మౌలిక సదుపాయాల సంస్థ ఎండీ దీవెన్ రెడ్డి, స్కిల్ డెవలప్‌మెంట్ సీఈవో నారాయణస్వామి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
