D NEWS: ధర్పల్లి మండలం దుబ్బాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం శశికళపై ఆరోపణలు చేస్తూ గ్రామ కమిటీ, పేరెంట్స్ కమిటీ, పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. పాఠశాలలోని పాత జనరేటర్, ఫర్నీచర్, కంప్యూటర్ పరికరాలు వంటి విలువైన వస్తువుల విక్రయంపై అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

హెచ్ఎంపై వచ్చిన ఆరోపణలను అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేయడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. ప్రజావాణి, జిల్లా విద్యాశాఖ అధికారులు, జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేసినా స్పందన లేదని వారు పేర్కొన్నారు.

హెచ్ఎంను సస్పెండ్ చేయాలని, లేదంటే బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ పాఠశాల ఎదుట నినాదాలు చేశారు. ఆరోపణలకు సంబంధించిన ఫొటోలు, ఇతర ఆధారాలు తమ వద్ద ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు.

సుమారు రెండు గంటల పాటు పాఠశాల ఎదుట ధర్నా, రాస్తారోకో నిర్వహించడంతో రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పాఠశాలకు జిల్లా స్థాయి అధికారులు వచ్చి ప్రత్యక్షంగా విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని గ్రామస్తులు కోరారు.

హెచ్ఎం శశికళపై చర్యలు తీసుకునే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, పాఠశాల కమిటీ సభ్యులు, మహిళలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.