
మెదక్ జిల్లాలో నేరాల నియంత్రణ, ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. అవుసులపల్లి గ్రామంలో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా సరైన పత్రాలు లేని 75 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మెదక్, నవంబర్ 7: మెదక్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అవుసులపల్లి గ్రామంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ నేతృత్వంలో 90 మంది పోలీసు అధికారులు, సిబ్బంది ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. నేరాల కట్టడితో పాటు ప్రజల్లో భద్రతపై అవగాహన కల్పించేందుకు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంను నిర్వహించారు.
ఈ తనిఖీల్లో సరైన వాహన పత్రాలు లేని 69 ద్విచక్ర వాహనాలు, రెండు బొలెరో వాహనాలు, నాలుగు ఆటోలను గుర్తించి మొత్తం 75 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాల ఉనికిని గుర్తించేందుకు నార్కోటిక్ డాగ్ జూబి సహాయంతో ఇళ్లు, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అలాగే ఫింగర్‌ప్రింట్ డివైజ్ ద్వారా వేలిముద్రలను సేకరించి పాత నేరస్థుల వివరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచిత వ్యక్తులకు ఓటీపీలు, బ్యాంకు ఖాతాల వివరాలు వెల్లడించవద్దని హెచ్చరించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ విక్రయాలు లేదా వినియోగం గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. తక్కువ దూరం ప్రయాణించినా హెల్మెట్ పెట్టుకోవడంతో పాటు, దాని స్ట్రాప్‌ను సరిగ్గా బిగించుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.
మహిళలు, బాలికల భద్రతకు సంబంధించిన చట్టాలపై కూడా గ్రామస్థులకు అవగాహన కల్పించారు. 18 ఏళ్లలోపు బాలికతో ఆమె అంగీకారంతో శారీరక సంబంధం పెట్టుకున్నప్పటికీ పోక్సో చట్టం కింద నేరమని, అలాంటి కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడతాయని హెచ్చరించారు. అత్యవసర సమయాల్లో పోలీసుల సహాయం పొందేందుకు 112 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.
ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం పోలీసుల ఉద్దేశం కాదని, వారి రక్షణతో పాటు గ్రామంలో నేరాలను అరికట్టేందుకే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అదనపు ఎస్పీ వివరించారు. పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. గ్రామస్థులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేందుకు వీఓపీ ఏఎస్ఐ విఠల్‌ను నియమించినట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐలు మహేష్, కృష్ణమూర్తి, ఎస్‌ఐలు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
