
D Spiritual: Oct 29: మంథనిలో ఘనంగా సంకష్టహర చతుర్థి పూజలు
మంథని: ఆశ్వయుజ మాస శుక్లపక్షంలో గురువారం సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని మంథని పట్టణంలోని గణనాథుని ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. సంకష్టహర చతుర్థి దీక్ష చేపట్టి శ్రీ గణనాథుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే ఆయన కరుణాకటాక్షాలతో జీవితంలోని కష్టాలు, ఆటంకాలు తొలగిపోతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.
మంథని పట్టణంలోని శ్రీ మహా గణపతి దేవాలయంలో సిద్ధి, బుద్ధి సమేతంగా కొలువుదీరిన గణనాథుడికి సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి.
సంకష్టహర చతుర్థి పూజా విధానం, విశిష్టత
ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే చవితి తిథిని సంకష్టహర చతుర్థిగా జరుపుకుంటారు. ఈ రోజున ఉపవాస దీక్ష చేపట్టి, రాత్రి చంద్రోదయం అనంతరం శ్రీ విఘ్నేశ్వరుడిని పూజించి భోజనం చేయడం శుభప్రదమని భక్తుల విశ్వాసం. గురువారం రాత్రి 8.40 గంటలకు చంద్రోదయం అనంతరం స్వామివారికి పూజలు నిర్వహించడం విశేషంగా భావిస్తారు.
సంకష్టహర చతుర్థి రోజున శ్రీ విఘ్నేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో పూజించి ఆలయంలో 21 ప్రదక్షిణలు చేయడంతో పాటు మోదకాలు, ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పిస్తే కష్టాలు తొలగి సుఖసంతోషాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. ఈ దీక్షను ఆచరించడం వల్ల జీవితంలో శాంతి, సౌఖ్యాలు కలుగుతాయని విశ్వసిస్తూ భక్తులు ప్రతి నెలా సంకష్టహర చతుర్థి పూజల్లో పాల్గొంటారు.
