
DNews: Dec12: విశాఖపట్నంలో అంతర్జాతీయ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ క్యాంపస్ ను విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. మధురవాడ హిల్ నెం-2లోని మహతి ఫిన్ టెక్ భవనంలో వెయ్యి మంది సీటింగ్ కెపాసిటీతో ఈ క్యాంపస్ ను ఏర్పాటుచేశారు. మంత్రి లోకేష్ కాగ్నిజెంట్ ఉద్యోగులతో మాట్లాడారు.కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు కాసేపట్లో శంకుస్థాపన చేయనున్నారు. ‘కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లో 21.31 ఎకరాలను సంస్థకు కేటాయించాం. అందులో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఐటీ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఐటీ క్యాంపస్‌ను సంస్థ మూడు దశల్లో రూ.1,583 కోట్లతో నిర్మించనుంది. తద్వారా 8,000 మందికి ఉపాధి లభిస్తుంది. 2029 నాటికి మొదటిదశ పూర్తి చేయడం ద్వారా 3,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 2033 నాటికి మూడు దశలను సంస్థ పూర్తి చేస్తుంది’ అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
ఈ కార్యక్రమంలో కాగ్నిజెంట్ సీఈవో ఎస్.రవికుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గుమ్మడి సూర్య, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తిరుమల నారాయణన్, వైస్ ప్రెసిడెంట్ గౌరవ్ హజ్రా, ఎంపీ శ్రీ భరత్, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ పాల్గొన్నారు.
