D NEWS: ఎన్నికల సంఘంపై కాంగ్రెస్, రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ గెలిచినప్పుడు ఈసీ సరిగ్గా పనిచేస్తుందని, ఓడిపోయినప్పుడు ఈసీపై ఆరోపణలు చేస్తుందని విమర్శించారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు ఎన్నికల సంఘం పనిచేయదని అన్నారు.

కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఎన్నికల సంఘంపై చేస్తున్న ఆరోపణలను కిషన్ రెడ్డి ఖండించారు. రాజ్యాంగబద్ధమైన సంస్థగా ఈసీ తన నిర్ణయాలను నిబంధనల ప్రకారమే తీసుకుంటోందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే ముందు కాంగ్రెస్ తన గత రాజకీయ వైఖరిని కూడా పరిశీలించుకోవాలని సూచించారు.

తాము చెప్పినట్లు వినడం లేదనే కారణంతో గతంలో ఎన్నికల సంఘం అధికారుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కిషన్ రెడ్డి ప్రస్తావించారు. 2009లో నాటి ప్రధాన ఎన్నికల కమిషనర్ గోపాలస్వామి, ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లా విషయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరుపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

దేశంలో బీజేపీపై వ్యతిరేకత లేదని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కూడా కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజల కోసం పనిచేస్తే ప్రజలు మళ్లీ మళ్లీ మద్దతు ఇస్తారని అన్నారు. ఎన్నికలు ఉన్నా లేకపోయినా బీజేపీ ప్రజల్లో ఉంటూ పనిచేస్తుందని పేర్కొన్నారు.

దేశ భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాద, తీవ్రవాద శక్తులతో సంబంధాలు కలిగి ఉందంటూ ఆయన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ఇప్పటికైనా వాస్తవాలను గుర్తించి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.

తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వాల పనితీరుపైనా కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగుల సమస్యలపై ఆయన ఆరోపణలు చేశారు. ప్రజలు కాంగ్రెస్ పాలనను గమనిస్తున్నారని పేర్కొన్నారు.