
పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు చెంపపెట్టు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈరోజు(శనివారం) మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి బీఆర్ఎస్‌లో కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారని విమర్శించారు.
సబితా ఇంద్రారెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లను పార్టీలోకి చేర్చుకుని మంత్రి పదవులు ఇచ్చారని మండిపడ్డారు. దానం నాగేందర్‌ను పదవి కొనసాగిస్తూనే కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేశారన్నారు. బీజేపీ న్యాయ పోరాటం వల్లే దానం నాగేందర్ అనర్హత వేటు పడిందంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ బీఆర్‌ఎస్ రెండూ భూదందా పార్టీలే అంటూ కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
దోచుకోవాలి దాచుకోవాలి పది తరాలకు సరిపోయెంత సంపాదించుకోవాలి. దోచుకుంటున్న పోటీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు పోటీ పడుతున్నాయి అని వ్యాఖ్యానించారు. అనేక అవినీతి ఆరోపణలు చేసినా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు మాత్రం తీసుకోవడం లేదని మండిపడ్డారు. మ్యాచ్ ఫిక్సింగ్‌తో రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయన్నారు.
అనేక హామీలిచ్చి నెరవేర్చకపోగా ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే పరస్పరం దోపిడీ ఆరోపణలు చేసుకుంటున్నారని విమర్శించారు. దోపిడీ చేసిన వారిని ఫాంహౌస్‌లకే పరిమితం చేశారన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఎలా ఇచ్చారో రాహుల్ గాంధీ చెప్పాలని డిమాండ్ చేశారు. దుర్మార్గపు రాజకీయ అవినీతి పరులను తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఏ ఎన్నికైనా బీజేపీ సిద్ధంగా ఉంటుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
