
D NEWS: ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయినట్లు తెలంగాణ శాసనసభ సచివాలయం అధికారిక గెజిట్ విడుదల చేసింది. దానం నాగేందర్ అనర్హత నేపథ్యంలో ఈ చర్య తీసుకుంది. 2024 ఏప్రిల్ 23 నుంచే అనర్హత అమల్లోకి వచ్చినట్లు గెజిట్‌లో పేర్కొంది.
శాసనసభ కార్యదర్శి రెండ్ల తిరుపతి ఈ మేరకు అధికారిక ప్రకటన జారీ చేశారు. పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన నిబంధనలు, న్యాయపరమైన ఆదేశాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా అధికారికంగా నమోదైంది.
గెజిట్ విడుదలతో ఖైరతాబాద్‌లో ఉపఎన్నికకు మార్గం ఏర్పడింది. ఎన్నికల సంఘం తదుపరి ప్రక్రియపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. నియోజకవర్గంలో ఇప్పటికే రాజకీయ పార్టీల కదలికలు పెరిగాయి.

ఇదిలా ఉండగా దానం నాగేందర్ తాజాగా ఖైరతాబాద్ ఉపఎన్నికపై స్పందించారు. SIR ప్రభావం నియోజకవర్గంలో ఉండదని ఆయన అన్నారు. ఎన్నికల సంఘం తీరుపై కూడా విమర్శలు చేశారు.
CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని దానం నాగేందర్ డిమాండ్ చేశారు. SIRలోని లోపాలపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టాలని కోరారు. ఖైరతాబాద్ ఉపఎన్నికలో ప్రజలు తనకు అనుకూలంగా తీర్పు ఇస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
