
ఫార్ములా-ఈ కార్ రేసింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ కోర్టులో విచారణకు హాజరయ్యారు. కేసును విచారించిన న్యాయస్థానం తదుపరి విచారణను అక్టోబర్ 30కి వాయిదా వేసింది. విచారణ అనంతరం కోర్టు నుంచి బయటకు వచ్చిన కేటీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల రూపాయల ఆస్తులు కొల్లగొట్టిందని ప్రభుత్వం ఆరోపిస్తోందని పేర్కొన్న ఆయన తమకు రూ.వెయ్యి కోట్లు ఇచ్చి ఆ లక్ష కోట్ల ఆస్తులన్నీ తీసుకోవాలని వ్యాఖ్యానించారు. మిగిలిన రూ.99 వేల కోట్లతో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నారు.
హైదరాబాద్‌తో పాటు తెలంగాణకు మంచి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఫార్ములా-ఈ రేసును తీసుకొచ్చామని కేటీఆర్ తెలిపారు. అయితే ఈ కార్యక్రమంలో ఏదో అవకతవకలు జరిగినట్లు ఆరోపిస్తూ దానిని రద్దు చేసి తనపై కేసులు నమోదు చేశారని ఆయన ఆరోపించారు. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఓ మోటార్ రేసింగ్ ఈవెంట్ కోసం లండన్ వెళ్లారని కేటీఆర్ ప్రస్తావించారు.
పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రంలో మోటార్ రేసింగ్‌కు ప్రోత్సాహం కల్పించేందుకు తాము కూడా అదే తరహాలో ప్రయత్నాలు చేశామని చెప్పారు. ఫార్ములా-ఈ రేసును తీసుకొచ్చినందుకు తమపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. న్యాయస్థానాలు న్యాయవ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉందని కేటీఆర్ అన్నారు. అందుకే రెండోసారి కోర్టు విచారణకు హాజరైనట్లు తెలిపారు. భవిష్యత్తులో ఎప్పుడు కోర్టు పిలిచినా విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు.
