
అసెంబ్లీ మండలి సమావేశాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తప్పనిసరిగా హాజరై ప్రతి చర్చలో చురుగ్గా పాల్గొనాలని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాలను ఎవరూ తేలికగా తీసుకోవద్దని సూచించారు. కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో బీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో అసెంబ్లీ మండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు రాష్ట్రంలోని పలు కీలక అంశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ చర్చించారు. స్పీకర్ వైఖరిపై బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో చర్చించాలని కేసీఆర్ సూచించారు. అసెంబ్లీ సమావేశాలను కనీసం 15 నుంచి 20 రోజులపాటు నిర్వహించేలా బీఏసీ సమావేశంలో పట్టుబట్టాలని పార్టీ నేతలకు ఆదేశించారు.
ప్రజా సమస్యలను ప్రధాన అజెండాగా చేసుకుని అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని ఇప్పుడు ప్రభుత్వ పనితీరు ఏమిటో ప్రజలకు అర్థమైందని అన్నారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ వందశాతం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సర్వభ్రష్ట ప్రభుత్వంగా ఆయన విమర్శించారు. నదీ జలాల వాటాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. అవసరమైతే ఈ అంశంపై పెద్దఎత్తున పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం ఎత్తిపోతల పథకాల కోసం లక్షమందితో ఆందోళన చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. అవసరమైతే తానే ఆందోళనకు నాయకత్వం వహిస్తానని చెప్పారు.
త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు సాగునీటి సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పాదయాత్ర చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. పాదయాత్రను తానే చేయాలా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేయాలా అనే దానిపై చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గాల వారీగా స్థానిక సమస్యలను గుర్తించి ప్రజలతో మమేకం కావాలని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు కేసీఆర్ సూచించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు.
