
D Spiritual: Oct 30: పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు ఎంతో విశిష్టమైనవిగా భావిస్తారు. ముఖ్యంగా కార్తీక మాసం కోటి సోమవారం రోజుకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఈ రోజున చేసే శివకేశవుల పూజలు, ఉపవాసాలు, దానాలు రెట్టింపు ఫలితాలను ఇస్తాయని శాస్త్రవచనం. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కోటి సోమవారం శ్రవణ నక్షత్రం ఎప్పుడు వస్తుందో, పూజా విధానం, విశిష్టత వంటి విషయాలను వివరంగా తెలుసుకుందాం.
కోటి సోమవారం ప్రాముఖ్యత
శివారాధనకు అత్యంత విశిష్టమైన కార్తీక మాసంలో సోమవారాలు ముఖ్యమైనవిగా భావిస్తారు. అందులోనూ కోటి సోమవారం మరింత పవిత్రమైనదిగా చెప్పబడింది. ఈ కోటి సోమవారం రోజున ఆచరించే స్నానం, దానం, ఉపవాసం వంటి కార్యక్రమాలకు కోటి రెట్లు అధిక ఫలితాలు ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
2025లో కోటి సోమవారం తేదీ మరియు శ్రవణ నక్షత్రం సమయం
ఈ ఏడాది 2025 అక్టోబర్ 30వ తేదీన కోటి సోమవారం శ్రవణ నక్షత్రం రానుంది. అక్టోబర్ 29 సాయంత్రం 5.29 గంటలకు శ్రవణ నక్షత్రం ప్రారంభమై, అక్టోబర్ 30 సాయంత్రం 6.33 గంటలకు ముగుస్తుంది. (ప్రాంతానుసారం కొద్దిపాటి సమయ భేదాలు ఉండవచ్చు.) కాబట్టి అక్టోబర్ 30వ తేదీనే కోటి సోమవారం ఆచరించనున్నారు.
శ్రవణ నక్షత్రం విశిష్టత
వ్యాస మహర్షి రచించిన స్కందపురాణం ప్రకారం, కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం రోజును కోటి సోమవారం అని అంటారు. ఈ మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది. కోటి సోమవారం రోజున ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైన సమయంగా భావిస్తారు.
ఈ రోజున హరిహరాదులను పూజించడం అత్యంత శుభప్రదం. కోటి సోమవారం రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి, నదీ స్నానం చేయడం ఉత్తమం. ఎందుకంటే కార్తీక మాసంలో శ్రీమహావిష్ణువు నదులు, చెరువులు, కాలువల్లో నివసిస్తాడని పురాణాలు పేర్కొంటాయి. అందుకే కార్తీక మాసంలో నది స్నానంకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
ఉపవాసం యొక్క ప్రాధాన్యం
కార్తీక మాసంలో సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి వంటి తిథుల్లో చాలా మంది ఉపవాసాలు చేస్తారు. అయితే కోటి సోమవారం రోజున ఆచరించే ఉపవాసం కోటి సోమవారాల ఉపవాసంతో సమానం అని పురాణాలు చెబుతున్నాయి.
కాబట్టి కోటి సోమవారం రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆహారం తీసుకోకుండా, రాత్రి నక్షత్ర దర్శనం అనంతరం భోజనం చేసి ఉపవాసం విరమించాలి.
శివ కేశవుల పూజా విధానం
కోటి సోమవారం రోజున శివాలయానికి వెళ్లి పంచామృతాలతో శివుడికి అభిషేకం చేయాలి. నువ్వుల నూనెతో మట్టి ప్రమిదలో దీపారాధన చేయడం శుభప్రదం. అనంతరం బిల్వ పత్రాలు, తుమ్మి పూలు సమర్పించి పరమశివుడిని ఆరాధించాలి. కొబ్బరికాయ, అరటిపండ్లు వంటి ప్రసాదాలను సమర్పించడం ఉత్తమం.
సాయంత్రం సమయంలో సంధ్యా వందనం చేసి, శ్రీమహావిష్ణువు ఆలయానికి వెళ్లి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. తులసీ మాలను సమర్పించి, శ్రీ విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వల్ల సకల శుభఫలాలు కలుగుతాయి.
అదే కాకుండా సాలగ్రామాలు శ్రీమహావిష్ణువు స్వరూపం అని పరిగణిస్తారు. కాబట్టి ఈ రోజు సాలగ్రామాలను గంధం, పుష్పం, అక్షతలతో పూజించి, బ్రాహ్మణులకు దానం చేయడం ద్వారా మోక్షం, వైకుంఠప్రాప్తి లభిస్తుందని శాస్త్రవచనం.
కోటి సోమవారం రోజున వనభోజన విశిష్టత
కార్తీక మాసంలో వనభోజనాలు విశేషంగా నిర్వహిస్తారు. అయితే కోటి సోమవారం రోజున చేసే వనభోజనం, మామూలు రోజుల్లో చేసే వనభోజనాల కంటే కోటి రెట్లు అధిక ఫలితాన్ని ఇస్తుందని పండితులు చెబుతున్నారు.
ఈ రోజున ఉసిరిక చెట్ల కింద, ఉసిరిక చెట్టు వద్ద శివలింగం, సాలగ్రామాన్ని ఉంచి పూజించి, అనంతరం కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో కలిసి సామూహిక భోజనం చేయడం చాలా శుభప్రదం.
సత్యనారాయణ వ్రతం ప్రాధాన్యం
ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం రోజున శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం వల్ల అఖండ ఐశ్వర్యం, సుఖసంతోషాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
ఈ రోజున సత్యనారాయణ స్వామి పూజ, ఉపవాసం, అలాగే పేదలకు దానం చేయడం అత్యంత శుభప్రదమని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.
