
కావలసిన పదార్థాలు
- ఉసిరికాయలు – అర కేజీ
- తురిమిన బెల్లం – అర కేజీ
- సోంపు – 1 టీస్పూన్
- మిరియాలు – పావు టీస్పూన్
- యాలకులు – 4
- దాల్చిన చెక్క – 1 అంగుళం ముక్క
- సొంటి లేదా అల్లం – చిన్న ముక్క
- కారం – అర టీస్పూన్
- ఉప్పు – చిటికెడు
- నెయ్యి – 1 టీస్పూన్
- వేయించిన పుచ్చగింజలు – 3 టేబుల్ స్పూన్లు
- నిమ్మరసం – 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం
1. ఉసిరికాయలను ఉడికించుకోవాలి: ముందుగా తాజా ఉసిరికాయలను శుభ్రంగా కడిగి, వాటిపై తేమ లేకుండా తుడవాలి. అనంతరం ఇడ్లీ పాత్రలో లేదా స్టీమర్లో వేసి ఆవిరిపై మెత్తబడే వరకు ఉడికించాలి. తర్వాత వాటిని బయటకు తీసి చల్లారనివ్వాలి.
2. మసాలా పొడి సిద్ధం చేసుకోవాలి: ఒక పాన్లో సోంపు, మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క, సొంటి వేసి తక్కువ మంటపై సువాసన వచ్చే వరకు వేయించాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తని పొడిలా తయారు చేసుకోవాలి.
3. ఉసిరికాయ ముద్ద తయారీ: ఉడికించిన ఉసిరికాయలను చేత్తో నొక్కి గింజలను తొలగించాలి. అనంతరం ముక్కలను మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా రుబ్బుకోవాలి.
4. బెల్లంతో ఉడికించాలి: ఇప్పుడు వెడల్పాటి పాన్లో ఉసిరికాయ ముద్ద, తురిమిన బెల్లం వేసి మీడియం మంటపై కలుపుతూ ఉడికించాలి. బెల్లం పూర్తిగా కరిగి మిశ్రమం చిక్కబడటం ప్రారంభమయ్యే వరకు కలుపుతూనే ఉండాలి.
5. మసాలాలు కలపాలి: బెల్లం, ఉసిరికాయ మిశ్రమం చిక్కబడిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పొడిని వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కారం, చిటికెడు ఉప్పు వేసి మరోసారి కలపాలి. మిశ్రమం చిక్కటి పాకంలా మారే వరకు సన్నని మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.
6. చివరిగా నెయ్యి, పుచ్చగింజలు: మిశ్రమం వేడిగా ఉన్నప్పుడే నెయ్యి, వేయించిన పుచ్చగింజలు వేసి బాగా కలపాలి. పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం పోసి మరోసారి కలపాలి. దీంతో రుచికరమైన ఆమ్లా చుండా సిద్ధమవుతుంది.
నిల్వ చేసుకునే విధానం
తయారైన ఆమ్లా చుండాను పూర్తిగా చల్లారిన తర్వాత తేమలేని, శుభ్రమైన గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. ఎప్పుడూ పొడి చెంచానే ఉపయోగించాలి. నిల్వ చేసే సమయంలో తేమ చేరకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఎక్కువ కాలం నిల్వ చేయాలనుకుంటే ఫ్రిజ్లో ఉంచడం మంచిది. నిల్వ వ్యవధి తయారీ విధానం, పరిశుభ్రత, తేమపై ఆధారపడి ఉంటుంది.
రోజూ కొద్దిగా ఆమ్లా చుండా తీసుకుంటే ఉసిరికాయను రుచికరమైన రూపంలో ఆహారంలో చేర్చుకున్నట్లవుతుంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే ఈ తీపి, పులుపు, మసాలా రుచుల కలయికను మీరు కూడా ఇంట్లో ప్రయత్నించండి!
