D Spiritual: Nov 20: హాసాకొత్తూర్‌లో వైభవంగా శ్రీదేవి జగదాంబ మాత జాతర.. బోనాల ఊరేగింపులో పాల్గొన్న మహిళలు

కమ్మర్‌పల్లి మండలంలోని హాసాకొత్తూర్ గ్రామంలో శ్రీదేవి జగదాంబ మాత అమ్మవారి జాతర ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. జాతరలో భాగంగా రెండో రోజు శుక్రవారం మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని మంగళహారతులు, బోనాలతో అమ్మవారికి ఘనంగా స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లు, భక్తి గీతాలు, నృత్యాల మధ్య బోనాల ఊరేగింపుగా అమ్మవారి ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించారు.

అనంతరం ఆలయంలో మహా చండీయాగం, కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలని, గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని మహిళలు అమ్మవారిని ప్రార్థించారు. ఈ ప్రత్యేక పూజల్లో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

జాతర సందర్భంగా చిన్నారులు భక్తి పాటలకు ఉత్సాహంగా నృత్యాలు చేయగా, ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. అనంతరం మహా అన్నప్రసాద వితరణ, డోలోత్సవం, భజనలు, కోలాట కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకల్లో గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేశారు.

ఈ కార్యక్రమాలను ఆలయ అర్చకులు రమణాచార్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *