D News: Sept 9: ఉద్యోగ నియామకాల్లో హైదరాబాద్‌ సరికొత్త రికార్డు

దేశంలో ఉద్యోగ నియామకాల విషయంలో హైదరాబాద్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. దేశంలోని ఇతర ప్రధాన మెట్రో నగరాలను వెనక్కి నెట్టి, నియామకాల వృద్ధిలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది హైదరాబాద్‌లో ఉద్యోగ నియామకాలు 23 శాతం పెరిగాయి. దేశీయ నియామక మార్కెట్‌ పరిస్థితులను అంచనా వేస్తూ నౌకరీ.కామ్‌ విడుదల చేసిన ‘జాబ్‌స్పీక్‌ ఇండెక్స్‌’ నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

దేశవ్యాప్తంగా కార్యాలయ ఉద్యోగాల మార్కెట్‌లోనూ పురోగతి కనిపించింది. ఆగస్టులో వార్షిక ప్రాతిపదికన 14 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది ఆగస్టులో 2,664 పాయింట్లుగా ఉన్న నౌకరీ జాబ్‌స్పీక్‌ సూచీ ఈసారి 3,028 పాయింట్లకు చేరింది. ఐటీతో పాటు ఐటీయేతర రంగాల్లోనూ, వివిధ స్థాయిల అనుభవం ఉన్న ఉద్యోగార్థుల విభాగాల్లోనూ నియామకాలు పెరగడం విశేషం.

అయితే ఈ నియామకాల వృద్ధిని పండగల సీజన్‌లో వచ్చిన మార్పుతో ముడిపెట్టి చూడాల్సి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతేడాది పండగల సీజన్‌ ఆగస్టులోనే ప్రారంభం కాగా, ఈసారి సెప్టెంబరుకు మారింది. దీంతో ఆగస్టు నియామకాల గణాంకాలపై ప్రభావం పడినట్లు నిపుణులు పేర్కొన్నారు. పండగల త్రైమాసికం పూర్తయిన తర్వాతే ఉద్యోగ మార్కెట్‌లో అసలైన పురోగతిపై మరింత స్పష్టత వస్తుందని ఇన్ఫో ఎడ్జ్‌ (ఇండియా) లిమిటెడ్‌ ఎండీ, సీఈఓ హితేష్‌ ఒబెరాయ్‌ తెలిపారు.

వాహన రంగంలో పెరిగిన నియామకాలు

రంగాల వారీగా చూస్తే వాహన విభాగంలో నియామకాలు 19 శాతం వృద్ధితో ముందంజలో నిలిచాయి. ఆరోగ్య సేవల రంగంలో 16 శాతం, రిటైల్‌ విభాగంలో 15 శాతం వృద్ధి నమోదైంది. బీమా రంగంలో 12 శాతం, సాఫ్ట్‌వేర్‌లో 11 శాతం కొత్త ఉద్యోగ అవకాశాలు లభించాయి.

బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ రంగాలు చెరో 10 శాతం వృద్ధిని నమోదు చేశాయి. బీపీఓ/ఐటీఈఎస్‌, చమురు-గ్యాస్‌, స్థిరాస్తి రంగాల్లో 8 శాతం చొప్పున నియామకాలు పెరిగాయి. ఫార్మా, బయోటెక్‌ రంగాల్లో నియామకాలు గతేడాది స్థాయిలోనే కొనసాగాయి. మరోవైపు పర్యాటక-ఆతిథ్య రంగంలో 4 శాతం, విద్యా రంగంలో 8 శాతం చొప్పున నియామకాలు తగ్గాయి.

అనుభవజ్ఞులకే ఎక్కువ అవకాశాలు

ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్‌లో అనుభవం ఉన్న అభ్యర్థులకు సంస్థలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. ఫ్రెషర్ల నియామకాల్లోనూ 15 శాతం వృద్ధి నమోదైంది. 4 నుంచి 7 ఏళ్ల అనుభవం ఉన్నవారి విభాగంలో 10 శాతం, 8 నుంచి 12 ఏళ్ల అనుభవం ఉన్నవారిలో 16 శాతం వృద్ధి కనిపించింది.

13 నుంచి 16 ఏళ్ల అనుభవం ఉన్న వారికి 18 శాతం, 16 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న సీనియర్‌ ఉద్యోగులకు 13 శాతం చొప్పున కొత్త అవకాశాలు లభించాయి. దీంతో అనుభవజ్ఞుల నియామకాలకు సంస్థలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.

చిన్న నగరాల్లోనూ జోరు

నగరాల వారీగా చూస్తే హైదరాబాద్‌ తర్వాత కోల్‌కతా 22 శాతం, చెన్నై 20 శాతం నియామకాల వృద్ధితో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఐటీకి ప్రధాన కేంద్రాలైన బెంగళూరు, పుణెల్లో చెరో 14 శాతం వృద్ధి నమోదైంది. దిల్లీ-ఎన్‌సీఆర్‌లో 10 శాతం, ముంబయిలో 7 శాతం నియామకాలు పెరిగాయి.

రెండో శ్రేణి నగరాల్లోనూ ఉద్యోగ నియామకాలు గణనీయంగా పెరిగాయి. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ 32 శాతం నియామకాల వృద్ధితో ముందంజలో నిలిచింది. రాయ్‌పుర్‌లో 23 శాతం, సూరత్‌లో 21 శాతం, రాంచీలో 19 శాతం వృద్ధి నమోదైంది.

ఉద్యోగ నియామకాలలో భారత్‌ అగ్రస్థానం

అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికంలో ఉద్యోగ నియామకాల విషయంలో భారత్‌ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. మ్యాన్‌పవర్‌ గ్రూప్‌ తాజా ‘ఎంప్లాయ్‌మెంట్‌ ఔట్‌లుక్‌ సర్వే’ ప్రకారం 2026 నాలుగో త్రైమాసికంలో భారత్‌ నికర ఉద్యోగ నియామకాల ఉద్దేశం 54 శాతంగా నమోదైంది.

గత త్రైమాసికంతో పోలిస్తే ఇది 6 శాతం, గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 11 శాతం అధికం. దేశవ్యాప్తంగా 3,055 సంస్థలపై నిర్వహించిన ఈ సర్వేలో 65 శాతం సంస్థలు అక్టోబర్‌-డిసెంబర్‌ మధ్య ఉద్యోగుల సంఖ్యను పెంచాలని భావిస్తున్నట్లు వెల్లడించాయి. 11 శాతం సంస్థలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించే అవకాశం ఉందని తెలిపాయి. మరో 24 శాతం సంస్థలు ఉద్యోగుల సంఖ్యలో ఎలాంటి మార్పు ఉండదని పేర్కొన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana