
D Tech: Jul 11: ఇంట్లో వై-ఫై సిగ్నల్ సరిగా అందడం లేదా? కారణం గోడలే కాదు.. ఈ వస్తువులూ కావచ్చు!
ఇంట్లో వై-ఫై సిగ్నల్స్ సరిగా అందకపోవడం, వీడియోలు బఫరింగ్ అవడం, రీల్స్ లోడ్ కావడానికి ఎక్కువ సమయం పట్టడం వంటి సమస్యలు చాలామందికి ఎదురవుతుంటాయి. దీనికి గోడలు మాత్రమే కారణమని భావిస్తే పొరపాటే. మన ఇంట్లోనే ఉండే కొన్ని సాధారణ వస్తువులు కూడా వై-ఫై సిగ్నల్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచంలోనే తొలి పెద్ద వై-ఫై నెట్వర్క్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్త అలెక్స్ హిల్స్ తన Wi-Fi and the Bad Boys of Radio పుస్తకంలో వై-ఫై సిగ్నల్‌కు అంతరాయం కలిగించే అంశాల గురించి వివరించారు. వాటిలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కూడా ఉన్నాయి.
మైక్రోవేవ్ ఓవెన్
మైక్రోవేవ్ ఓవెన్లు, చాలా వై-ఫై రూటర్లు ఒకే 2.4 GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లో పనిచేస్తాయి. ముఖ్యంగా పాతబడిన లేదా సరిగా పనిచేయని మైక్రోవేవ్ ఓవెన్ల నుంచి వెలువడే తరంగాలు వై-ఫై సిగ్నల్‌కు అంతరాయం కలిగిస్తాయి. అందుకే మైక్రోవేవ్ పనిచేస్తున్న సమయంలో ఇంటర్నెట్ వేగం తగ్గినట్లు అనిపించవచ్చు.
అక్వేరియం (మీన్ల తొట్టి)
ఇంట్లో అక్వేరియం ఉండటం అందంగా కనిపించినా, వై-ఫై సిగ్నల్‌కు మాత్రం అడ్డంకిగా మారుతుంది. రేడియో తరంగాలు నీటిలో ప్రయాణించే సమయంలో వాటి శక్తి తగ్గిపోతుంది. దీనిని శాస్త్రవేత్తలు “షాడోయింగ్” (Shadowing) అని పిలుస్తారు. రూటర్‌కు, మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌కు మధ్యలో అక్వేరియం ఉంటే సిగ్నల్ బలహీనపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అద్దాలు, పెద్ద టీవీలు
అద్దాలు, పెద్ద టీవీ స్క్రీన్లు, లోహపు ఉపరితలాలు కూడా వై-ఫై సిగ్నల్‌ను ప్రభావితం చేస్తాయి. కాంతి అద్దంపై పడితే ఎలా పరావర్తనం చెందుతుందో, రేడియో తరంగాలు కూడా ఇలాంటి ఉపరితలాలపై తాకి దిశ మారుస్తాయి. దీంతో ఇంట్లో కొన్ని ప్రాంతాల్లో సిగ్నల్ బలహీనంగా మారుతుంది.
చలికాలం, మంచు ప్రభావం
బయట ఏర్పాటు చేసిన నెట్‌వర్క్‌ల విషయంలో తీవ్రమైన చలి, మంచు తుఫానులు కూడా ప్రభావం చూపుతాయి. మంచు వల్ల వై-ఫై కేబుల్స్ దెబ్బతినడం, శాటిలైట్ డిష్‌లపై మంచు పేరుకుపోవడం వంటి కారణాలతో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలగవచ్చు.
వై-ఫై స్పీడ్ పెంచుకోవడానికి చిట్కాలు
రూటర్‌ను ఇంటి మధ్య భాగంలో, వీలైనంత ఎత్తైన ప్రదేశంలో ఉంచడం మంచిది. రూటర్‌కు సమీపంలో అద్దాలు, పెద్ద ఎలక్ట్రానిక్ పరికరాలు, అక్వేరియంలు వంటి అడ్డంకులు లేకుండా చూసుకోవాలి.
పాత 2.4 GHz రూటర్లకు బదులుగా 5 GHz లేదా డ్యూయల్-బ్యాండ్ రూటర్లను ఉపయోగిస్తే అంతరాయం తక్కువగా ఉంటుంది. అలాగే ఇల్లు పెద్దదైతే వై-ఫై ఎక్స్టెండర్లు లేదా మెష్ నెట్వర్క్ సిస్టమ్‌లను ఉపయోగించడం ద్వారా ప్రతి మూలకు మెరుగైన సిగ్నల్ అందేలా చేసుకోవచ్చు.
